శనివారం 04 జూలై 2020
Warangal-city - May 30, 2020 , 03:08:55

కల సాకారం చేసిన అపర భగీరథుడు కేసీఆర్‌కు జనం నీరాజనం..

కల సాకారం చేసిన అపర భగీరథుడు కేసీఆర్‌కు జనం నీరాజనం..

  • కాళేశ్వరం టు  కొండపోచమ్మ
  • అనతికాలంలోనే తుది ఘట్టానికి చేరిన ప్రాజెక్టు
  • మాగాణి అవుతున్న బీడు భూములు 
  • కాల్వల్లో నీళ్లు చూసి రైతుల పరవశం
  • ఊరూరా క్షీరాభిషేకాలు
  • పరవళ్లు తొక్కిన గోదావరి 

అరవై ఏండ్ల దుఃఖాన్ని 14 ఏండ్ల అలుపెరుగని పోరాటంతో తీర్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్‌.. అదే పట్టుదలతో కేవలం మూడేండ్లలోనే కాళేశ్వరం నుంచి గోదారమ్మను కొండపోచమ్మకు చేర్చి ప్రాజెక్టును తుదిఘట్టానికి తీసుకువచ్చారు. తెలంగాణ సాధనలోనే కాదు.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధిలోనూ ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారు. ఎక్కడి గోదావరి.. ఎక్కడి కొండపోచమ్మ. నట్టనడి ఎండలో దారిపొడవునా జలసవ్వడుల గలగలలు.  నీటి కోసం ఎదురుచూసిన ఎడారి దుక్కులు తనమీదుగా ఎగిరిదుంకి పారుతున్న గోదారమ్మను శిరసెత్తుకొని సంబురపడుతున్నవి. కాల్వల్లో పారుతున్న నీళ్లను చూసి రైతులు పరవశిస్తున్నారు. నీరు పల్లమెరుగును అనే నానుడిని మార్చి ఎత్తుకు సైతం ఎగబాకును అని నిరూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్రమే కాదు దేశం ఈ రోజు సగర్వంగా కీర్తిస్తున్నది. అపర భగీరథుడికి ఊరూరా జనం నీరాజనాలు పడుతున్నారు. 

వరంగల్‌ ప్రతినిధి/ వరంగల్‌ రూరల్‌-నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులో తుది అంకం పూర్తయింది. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ పంపుహౌస్‌లోని రెండు మోటర్లను సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఆ జలా లు కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో 38 లక్షలకుపైగా ఎకరాలకు సాగు నీరందించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఇం దులో 19 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు. మరో 19 లక్షల ఎకరాలు స్థిరీకరణ ఆయకట్టు. ఈ స్థిరీకరణ ఆయకట్టులో ఎస్సారెస్పీ ఆయకట్టు కూడా ఉంది. 

ఇదీ గోదావరి పరవళ్ల దారి..


మేడిగడ్డే తెలంగాణ జీవగడ్డ అని నిర్ణయించి ప్రాజెక్టుల రీ-డిజైన్‌ చేయడమే అందుకు అసలైన మార్గమని ఎంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో రికార్డు స్థాయిలో పూర్తి చేసి సరికొత్త నీటి చరిత్రను లిఖించారు. ఒకటి కాదు రెండు ఏకంగా 145 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని పట్టువదల జలవిక్రమార్కుడిగా అహోరాత్రులు తను శ్రమించి తన పరివారాన్ని విశ్రమించక పనిచేయించి ప్రపంచ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చరితార్థపు చరిత్రను సృష్టించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై ప్రభుత్వం బరాజ్‌ నిర్మించింది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య 16 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్‌ పూ ర్తయ్యింది. ప్రాణహిత నీరు లక్ష్మీ బరాజ్‌లోకి చేరుతుంది. ఆ తర్వాత  లక్ష్మీ (కన్నెపల్లి) పంప్‌హౌస్‌, సరస్వతీ బరాజ్‌, పార్వతీ బరాజ్‌, నంది పంప్‌హౌస్‌, ఎల్లంపల్లి జలాశయం, గాయత్రీ పంప్‌హౌస్‌ (ఎస్సారెస్పీ వరద కాల్వ) అక్కడి నుంచి ఎస్సారార్‌ రిజర్వాయర్‌, తిప్పాపూర్‌, రంగనాయక్‌సాగర్‌, తుక్కాపూల్‌ పంప్‌హౌస్‌, అక్కావుల్‌ పంప్‌హౌస్‌, మర్కూక్‌ పంప్‌హౌజ్‌ దాకా అవిశ్రాంత, అప్రతిహత జలసిరుల పరుగులు తీసి గోదావరి జలాలు కొండపోచమ్మకు చేరుకున్నాయి. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ దాకా గోదావరి బీడు భూములను తడిపింది. కాల్వలో పారుతున్న నీళ్లను చూసి సబ్బండ వర్గాలు సంబురపడ్డాయి. అనతికాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికాగా, కలను సాకారం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రైతులు నీరాజనం పలుకుతున్నారు. ఆయన చిత్రపటాలకు ఊరూరా క్షీరాభిషేకం చేస్తున్నారు. 

ఊరూరికి‘ కాళేశ్వరం’


కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే ఎస్సారెస్పీ పునర్జీవ పథకం చేపట్టింది. సమైక్య పాలనలో నిర్మించగా పాడైన ఎస్సారెస్పీ కాల్వలను ఈ పథకం ద్వారా పునరుద్ధరించింది. కాకతీయ ప్రధాన కాల్వతో పాటు ఉప కాల్వల్లో సిమెంటు కాంక్రీట్‌తో లైనింగ్‌ చేసింది. పూడుకపోయిన పంట కాల్వలను తిరిగి తవ్వింది. కాళేశ్వరం నీటిని చెరువులు, రిజర్వాయర్లలో నింపేందుకు ఎస్సారెస్పీ కాల్వల్లో ఓటీలు నిర్మించింది. ఆయా గ్రామంలోని ఒక చెరువులోకి ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీరు విడుదల చేస్తే మత్తడి ద్వారా గొలుసుకట్టు పద్ధతిన ఇతర చెరువులు నిండేలా చర్యలు తీసుకుంది. ఎల్లంపల్లి బరాజ్‌ల మీదుగా మిడ్‌మానేరు ద్వారా కాళేశ్వరం జలాలు ఎల్‌ఎండీకి చేరాయి. అక్కడి నుంచి కాకతీయ కాల్వ ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టు ఏరియాకు తరలించింది. గత డిసెంబరు నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు నిరంతరం నాలుగు నెలలకు పైగా ప్రతిరోజూ కాకతీయ ప్రధాన కాల్వలో సగటున 5 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. ఇది ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు వెళ్లింది. ఎస్సారెస్పీ చరిత్రలో కాకతీయ ప్రధాన కాల్వ ద్వారా ఒక సంవత్సరంలో 30 రోజులు నీరు ప్రవహించిన దాఖలాల్లేవు. అదికూడా ఏ రోజు 3 వేల క్యూసెక్కులు దాటలేదు. చివరి ఆయకట్టుకు అందలేదు. ఎప్పుడూ లేని విధంగా తొలిసారి నాలుగు నెలలకు పైగా రోజూ 5 వేల క్యూసెక్కుల నీరు కాకతీయ ప్రధాన కాల్వ ద్వారా ప్రవహించడం విశేషం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజి-1 పరిధిలో సుమారు 4.24 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీరు అందింది. ఇక్కడ 650 నుంచి 700 చెరువులు, రిజర్వాయర్లు నింపినట్లు నీటి పారుదల శాఖ ఇంజినీర్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం నీరు ఊరూరికి రానుంది.

సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం

కాశీబుగ్గ/ కాజీపేట: అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పలు ప్రాంతాల్లో శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు, ఉద్యమకారుడు భూక్య మోతీలాల్‌ ఆధ్వర్యంలో వరంగల్‌లో,  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేశ్‌, నాయకుడు గబ్బెట శ్రీనివాస్‌ కాజీపేట చౌరస్తాలో క్షీరాభిషేకాలు కొనసాగాయి.  ఇందులో రెడ్డి రమేశ్‌బాబు, కల్యాణ్‌, ప్రవీణ్‌కుమార్‌, కృష్ణంరాజు, షకీల్‌, ఐలయ్య శిరుమల్ల దశరథం, అఫ్జల్‌, మహ్మద్‌ సోనీ, శివకుమార్‌, అశోక్‌, కృష్ణ, సదానందం, అయ్యాల దానం, భిక్షపతి, యాదగిరి, నర్సింగ్‌, కుమార్‌, కనుకరాజు, సర్వర్‌, వినయ్‌, నరేశ్‌, విజయ్‌భాస్కర్‌, మల్లికార్జున్‌, కుమారస్వామి, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, వేణు, పోశయ్య పాల్గొన్నారు.

ఆలోచనే అద్భుతం 

కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచనే అద్భుతం. ఇక నిర్మాణం మహాద్భుతం. పనులు సూత్తాంటెనే అయిపోయినై. మూడేళ్లల్లో గింత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్‌ తలుసుకుంటే ఎట్ల ఉంటదో నిరూపించిండు. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిండు. రాష్ట్రం వచ్చినంక నీటి గోస తీర్చేందుకు అపర భగీరథుడు అయిండు. అహోరాత్రులు కష్టపడ్డరు. కిందికి పారే నీళ్లను ఎత్తుకు పరుగులు తీసేలా ప్రాజెక్టు కట్టిండు. గిట్ల గోదావరి నీరు పారుతదని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. ఈ రోజు ప్రాజెక్టు లక్ష్యం సంపూర్ణ దశకు చేరింది. ఇంత గొప్ప ప్రాజెక్టు మా ఊరిలోనే మొదలవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. 

-కావేరి శేఖర్‌/ కన్నెపల్లి గ్రామం

సీఎం సారు సల్లంగ ఉండాలె 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీళ్లిచ్చిన సీఎం కేసీఆర్‌ పదికాలాల పాటు సల్లంగ ఉండాలె. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాల్వల్లో పుష్కలంగానీళ్లు వచ్చినై. ఈ నీళ్లతో రెండు పంటలు పండించుకున్నం. చెరువులు, కుంటలు నీటితో నిండినై. నేను మొక్కజొన్న పంటను సాగు చేశాను. 150బస్తాల దిగుబడి వచ్చింది. గతంలో సాగు నీరు అందక అనేక ఇబ్బందులు పడ్డా.  ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా అయింది.

-భూక్య కిషన్‌నాయక్‌, రైతు, చెన్నారావుపేట 


logo