శనివారం 30 మే 2020
Warangal-city - Apr 28, 2020 , 02:47:51

నిరాడంబరంగా పండుగ

నిరాడంబరంగా పండుగ

  • గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం 
  • వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ జెండాల ఆవిష్కరణ
  • అమరవీరులకు మంత్రి ఎర్రబెల్లి నివాళి
  • పాలకుర్తి, పర్వతగిరి, నెక్కొండలో పర్యటన
  • పేదలకు నిత్యావసరాలు పంపిణీ

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ/పాలకుర్తిరూరల్‌/పర్వతగిరి/నెక్కొండ : తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది వేడుకలు సోమవారం వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అత్యంత నిరాడంబరంగా జరిగాయి. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో గులాబీ శ్రేణులు ఎక్కడికక్కడ సామాజిక దూరాన్ని పాటిస్తూ వాడవాడలా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నివాళులర్పించారు.  నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రియాదవరెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్‌ సీతారాంనాయక్‌ పాల్గొన్నారు. అమరవీరుల జంక్షన్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ జెండాను వినయ్‌భాస్కర్‌ ఆవిష్కరించారు. మరోవైపు వరంగల్‌ పశ్చిమ నియోజకర్గంలోని 20వేల మంది కార్యకర్తలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు తొమ్మిది వేల మందికి అందించారు. 

ఉద్యమకారులకు మంత్రి ఎర్రబెల్లి సన్మానం  

తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగస్వాములైన నాయకులు, కార్యకర్తలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ప్రాణాలను పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యమ సందర్భంలో కేసీఆర్‌ అనుసరించిన గాంధేయమార్గం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న తీరును ఆయన వివరించారు. దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రాజకీయ ప్రస్థానం, రాష్ట్ర సాధన అనంతరం అన్నిరంగాల్లో ప్రజలు పురోగమిస్తున్నారని పేర్కొంటూ ఇందు కు కేంద్ర ప్రభుత్వం, అనేక జాతీయ సంస్థల అవార్డులే నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టకపోతే స్వరాష్ట్రం వచ్చేది కాదని, రాష్ట్రంలో ఇవ్వాళ ఆదర్శమైన పాలన జరిగేది కాదని ఆయన వివరించారు. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించి ఉద్యమ గురువు ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌, అమరుడు శ్రీకాంతాచారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఎర్రబెల్లి ట్రస్టు నుంచి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో అన్యాయానికి గురైన తెలంగాణను సీఎం కేసీఆర్‌ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఇందుకు నిదర్శనమే రూ.45 వేల కోట్లతో ‘మిషన్‌భగీరథ’ పథకాన్ని అమలు చేస్తూ ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూములకు సాగునీరందిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రధాని మోడీ మెచ్చుకుంటుంటే తట్టుకోలేని రాష్ట్ర బీజేపీ నేతలు తమ ఉనికి కోసం ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇదిలా ఉండగా పర్వతగిరిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ.. జై కేసీర్‌ అంటూ నేతలతో కలిసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. నెక్కొండలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, స్వప్న దంపతులను ఎర్రబెల్లి సన్మానించారు. తెలంగాణ ఉద్యమంలో వారు నిర్వహించిన పాత్రను ఆయన కొనియాడారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నర్సంపేట ప్రాంతానికి తీసుకొచ్చిన ఘనత పెద్ది సుదర్శన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు అందరూ స్వీయనియంత్రణ పాటించాలని ఆయన కోరారు.

తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యం

  • మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అధ్యక్షతన నిర్వహించారు. మంత్రి పార్టీ జెండాను ఎగురవేయగా, ఎంపీ మాలోత్‌ కవిత, జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందు, రాష్ట్ర వేజ్‌ బోర్డు చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రైల్వే స్టేషన్‌ వద్ద అనాథలకు భోజనం అందజేశారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉంటున్న వలస కూలీలకు చికెన్‌తో భోజనం అందించారు. నందనా గార్డెలో మున్సిపల్‌ సిబ్బందితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కేసీఆర్‌ 20 ఏళ్లక్రితం ఉద్యమం మొదలుపెట్టి, రాష్ర్టాన్ని సాధించి, ఈ రోజు కోట్లాది మంది ఆదరాభిమానాలు, యోగ క్షేమాలు చూస్తున్నారని, నిజంగా ఈ రోజు గొప్పదినమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చేస్తున్నారని అన్నారు.ఎంపీ మాలోత్‌ కవిత మట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు గుండెల్లో నిలుపుకున్నారని, అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచిందన్నారు. ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. 14ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణకు ఉద్యమకారుడు సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌పాషా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఫరీద్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మార్నేని వెంకన్న, కేఎస్‌ఎన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు యాస వెంకట్‌రెడ్డి, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గడ్డం అశోక్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ జనార్దన్‌, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. 

వరంగల్‌లో..

వరంగల్‌, నమస్తే తెలంగాణ/ఖిలావరంగల్‌/పోచమ్మమైదాన్‌/వరంగల్‌ చౌరస్తా/కాశీబుగ్గ/కరీమాబాద్‌ : తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీదేనని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖిలావరంగల్‌లోని అమరవీరుల స్తూపానికి ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్యే నరేందర్‌, కార్పొరేటర్‌ బైరబోయిన దామోదర్‌యాదవ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశాయిపేట సెంటర్‌, కరీమాబాద్‌, కాశీబుగ్గ జంక్షన్లలో కూడా టీఆర్‌ఎస్‌ జెండాలను ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్యే నరేందర్‌ ఆవిష్కరించారు. హంటర్‌రోడ్డులోని పద్మావతి గార్డెన్‌లో నిత్యావసర సరుకుల కోసం రూ. 3 వేల విలువైన డీమార్ట్‌ కూపన్లను ఆయన జర్నలిస్టులకు అందజేశారు. ఉద్యమకారుడు కొమ్మిని సురేశ్‌ ఆధ్వర్యంలో కరీమాబాద్‌లో పేదలకు ఎంపీ దయాకర్‌, ఎమ్మె ల్యే నరేందర్‌ పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 

వర్ధన్నపేటలో.. 

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ: పార్టీ చేపట్టిన అనేక పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌  అన్నారు. వర్ధన్నపేటలో ఆయన టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు.   

నర్సంపేటలో..

నర్సంపేట,నమస్తేతెలంగాణ/చెన్నారావుపేట: అమరుల త్యాగాలను మరువలేమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట అమరవీరుల జంక్షన్‌లో ఆయన టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చెన్నారావుపేట ఎంపీపీ కార్యాలయ ఆవరణలో నర్సంపేట వైద్యుడు డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి సహకారంతో రూ.3 లక్షల విలువైన పండ్లను గ్రామాల వారీగా ప్రతి కు టుంబానికి కిలో చొప్పున పంపిణీ చేశారు. 

మరిపెడలో..

మరిపెడ, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం యావత్‌ దేశానికి రోల్‌ మోడల్‌గా నిలిచిందని డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్‌ అన్నారు. సోమవారం మరిపెడలో టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. 

భూపాలపల్లిలో..

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/భూపాలపల్లి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో టీఆర్‌ ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి అధ్యక్షతన జరిగిన ఆవిర్భావ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుక ల్లో దివ్యాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పాల్గొనగా గండ్ర ప్రజలకు మాస్క్‌లు పంపిణీ చేశారు.  

జనగామలో..

జనగామ, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ పాలనలోనే తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

విస్సంపల్లిలో..

చిన్నగూడూరు : టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ముందు వరుసలో నిలిచిందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. సోమవారం విస్సంపల్లిలో స్థానికులతో కలిసి ఆయన గులాబీ జెండాను ఆవిష్కరించారు.  

స్టేషన్‌ఘన్‌పూర్‌లో..

స్టేషన్‌ఘన్‌ఫూర్‌, నమస్తేతెలంగాణ/స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌ : స్వరాష్ర్టాన్ని పోరాడి సాధించిన మహానేత సీఎం కేసీఆర్‌ అని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ జెండాను ఆయన ఆవిష్కరించారు. చిలుపూరు మండలం పల్లగుట్టలో ఆటోడ్రైవర్లు, పారిశుధ్య కార్మికులు, ఆశవర్కర్లు, పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. 

హన్మకొండలో..

హన్మకొండ, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌ 20వ ఆవి ర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ బాల సముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్మి స్తున్న కాళోజీ కళాక్షేత్రం భవన నిర్మాణ వలస కార్మికులకు కడి యం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కావ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి భోజనం ఏర్పాటు చేశారు. 

ములుగులో..

ములుగు, నమస్తేతెలంగాణ: జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం, జంగాలపల్లిలో జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ గులాబీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్‌, జెడ్పీటీసీ సకి నాల భవాని, మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌, పట్టణ అధ్యక్షుడు సంతోశ్‌, నాయకులు పాల్గొన్నారు. 

శాయంపేటలో..

శాయంపేట: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్బంగా శా యంపేట జంక్షన్‌లోని పార్టీ జెండాను రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని 184 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 


logo