శుక్రవారం 05 జూన్ 2020
Wanaparthy - May 23, 2020 , 03:26:08

జానంపేటకు జాక్‌పాట్‌

జానంపేటకు జాక్‌పాట్‌

 మోడల్‌ గ్రామీణ ఆరోగ్య పరిశోధన యూనిట్‌ మంజూరు 

 రూ.3.05 కోట్లతో ఏర్పాటుకు చర్యలు

 తొలివిడుతగా రూ. 80లక్షలు మంజూరు

 హెల్త్‌ ప్రొఫైల్‌తో మెరుగైన సేవలకు ఆస్కారం

 ఆరోగ్య సంరక్షణకు ఆధునిక సాంకేతికత తోడు

జానంపేట పీహెచ్‌సీకి జాక్‌ పాట్‌ తగిలింది. ఐసీ ఎంఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌) ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మోడల్‌ రూరల్‌ హెల్త్‌ రీసెర్చ్‌ యూనిట్‌ను మంజూరు చేసింది. రూ. 3.05 కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం తొలిదఫాలో రూ.80 లక్షలు మంజూరయ్యాయి. స్థల సేకరణ పూర్తికాగానే భవన నిర్మాణాన్ని ప్రారంభి ంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధులపై పరిశోధనలకు ఇక్కడి కేంద్రం చిరునామాగా నిలువనున్నది. ప్రజల హెల్త్‌ ప్రొఫైల్స్‌కు అనుగుణంగా అందించాల్సిన వైద్యసేవలపై పరిశోధనలకు అవకాశం ఉంటుంది. 

- మహబూబ్‌నగర్‌ ప్రతినిధి 

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి: మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలోని జానంపేట పీహెచ్‌సీకి అదృష్టం వరించింది. ఆరోగ్య కేంద్రం ఆవరణలో మోడల్‌ గ్రామీణ ఆరోగ్య పరిశోధన యూనిట్‌ (ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూ)ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పరిధిలో పనిచేసే ఈ యూనిట్‌కు కేంద్రం రూ. 3.05కోట్లతో ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకుగాను తొలివిడుతగా రూ. 80లక్షలు మంజూరు చేశారు. స్థల సేకరణ పూర్తి కాగానే భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూ ఏర్పాటుతో స్థానిక వ్యాధులపై అనేక పరిశోధనలు జరుగనున్నాయి. హెల్త్‌ ప్రొఫైల్‌ను తయారు చేసి స్థానికంగా మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త సమన్వయంతో స్థానిక ఆరోగ్య సమస్యలపై పరిశోధనలకు ఊతమివ్వనున్నాయి. మారుమూల, గిరిజన, కొండ ప్రాంతాల ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ ద్వారా వారి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాల అనుబంధంగా పనిచేయనున్న ఈ కేంద్రం ద్వారా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ మెరుగుదలకు బీజం పడనున్నది. స్థానిక వైద్య నిపుణులు, వైద్య విద్యార్థులు పరిశోధనలు చేసేందుకు ఈ కేంద్రం చక్కని వేదిక కానున్నది. ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్రాన్ని నిర్వహిస్తాయి. 

రైలు, రోడ్డు, విమాన సౌకర్యం ఉంది

జాతీయ రహదారి-44పై ఉన్న జానంపేట పీహెచ్‌సీని ఆదర్శ దవాఖానగా చేశాం. ఉమ్మడి జిల్లాకు కేంద్ర బిందువు లాంటి ప్రాంతంలో ఉన్న ఈ పీహెచ్‌సీకి మోడల్‌ గ్రామీణ ఆరోగ్య పరిశోధన యూనిట్‌ మంజూరు చేయడం వల్ల అందరికీ అందుబాటులో ఉంటుంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. హైదరాబాద్‌, ఇటు బెంగళూరుకు చక్కని కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. సమీపంలోని మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి అర గంటలో జానంపేటకు రావచ్చు. ఇక్కడ పరిశోధనల ద్వారా స్థానికుల ఆరోగ్య పరిరక్షణకు ఊతం అందించాలని ఆశిస్తున్నాం. 

- ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర


స్థానిక రోగాలపై ప్రత్యేక దృష్టి

స్థానికంగా వచ్చే వ్యాధులపై ప్రత్యేక దృష్టితో ప్రయోగాలు చేస్తారు. జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వివిధ రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇక్కడ పరిశోధనలు చేయనున్నారు. ప్రతిష్టాత్మకమైన పరిశోధన కేంద్రం ఈ ప్రాంతానికి రావడం ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. ఇక్కడి ప్రజల అదృష్టం. 

- శ్వేత, మెడికల్‌ ఆఫీసర్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జానంపేట 

పరిశోధనలు చేయొచ్చు

వైద్య పరిశోధనలకు పనికొస్తుంది. ఎన్‌ఐఎన్‌ వైద్య పరిశోధన కేంద్రం తెలంగాణలో ఒక్కటే. దీనివల్ల కరోనాపై పరిశోధనలు, అనేక రోగాలకు సంబంధించి పరిశోధనలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అద్భుతాలు చేయవచ్చు. వ్యాక్సిన్లను కనుగొనవచ్చు. రాష్ర్టానికి సంబంధించిన వ్యాధులపై, ఆహారపు అలవాట్లు, లోపాలు, ఫ్లోరోసిస్‌ పై ఎల్లలు దాటే పరిశోధనలు చేయొచ్చు. నల్లమల, మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు చేయొచ్చు. 

- డాక్టర్‌ రాంకిషన్‌, సూపరింటెండెంట్‌,  జనరల్‌ దవాఖాన, మహబూబ్‌నగర్‌

పరిశోధన కేంద్రం.. పాలమూరుకు వరం

వైద్య పరిశోధన హైదరాబాద్‌ మెడికల్‌ కళాశాలలోనే ఉంటుంది. కొత్త విధానంలో పేషెంట్లు జానంపేట రీసెర్చ్‌ సెంటర్‌కు వెళ్తారు. బాల్య వివాహాల వల్ల చిన్న వయసులో తల్లులు అవుతున్నారు. తద్వార రక్తహీనత, తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి అంశాలపై స్థానికుల వద్దకు వెళ్లి పరిశోధన చేస్తారు. జబ్బును గుర్తిస్తారు. వాటికి పరిష్కారం కనుక్కొంటారు. అధునాతన వైద్య పరిశోధన కేంద్రం ఉమ్మడి పాలమూరు జిల్లాకు రావడం వరం. 

- డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, డైరెక్టర్‌, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, మహబూబ్‌నగర్‌


స్థల సేకరణ పూర్తయిన వెంటనే..

జానంపేటలో మోడల్‌ గ్రామీణ ఆరోగ్య పరిశోధన యూనిట్‌ మంజూరైంది. ఇందుకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే భవన నిర్మాణం చేపట్టనున్నాం. ఈ కేంద్రం వల్ల స్థానికంగా వచ్చే రోగాలపై ప్రత్యేకంగా పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంటుంది. వాటికి కారణాలను విశ్లేషించి.. నివారణకు మార్గం కనుగొనేందుకు ఈ యూనిట్‌ పనిచేస్తుంది. 

- డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌, ప్రతినిధి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, హైదరాబాద్‌


మోడల్‌ గ్రామీణ ఆరోగ్య పరిశోధన యూనిట్‌ ఏర్పాటు వల్ల..

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య, సాంకేతిక అంశాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

జాతీయ, రాష్ట్రస్థాయిలో జరిగే వైద్య ఆరోగ్య పరిశోధనలను గ్రామీణ ప్రజలకు చేరువ చేయడం.

వైద్యారోగ్య పరిశోధనలను భౌగోళికంగా సుదూర ప్రాంతాలకు (ఉదాహారణకు నల్లమల చెంచులు) చేరవేయడం.

స్థానికంగా సంక్రమించే వ్యాధులకు కారణాలు, జనాభాలో ఉండే వివిధ వైరుధ్యాలపై పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడం. 

రాష్ట్రస్థాయిలో పరిశోధనకు కావాల్సిన శిక్ష ణ ఇచ్చి వ్యవస్థను బలోపేతం చేసి జాతీయ స్థాయిలో అనుసంధానం చేయడం.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సూక్ష్మ ఆహార పోషకాలు చాలా మందిలో లోపించాయని సర్వేలో తేలింది. బాల్య వివాహాలు 41శాతం జరుగుతున్నాయి. 15 నుంచి 18 ఏండ్లలోపు యువతుల్లో 15శాతం మంది బాల్య వివాహాల వల్ల గర్భం దాలుస్తున్నారు.

జిల్లాలో మాతా శిశు మరణాల రేటు, అనీమియా, డెంగీ అధికంగా ఉన్నట్లు జాతీయ ఆరోగ్య సంస్థ సర్వేలో తేలింది. ఇలాంటి అంశాలపై మోడల్‌ గ్రామీణ ఆరోగ్య పరిశోధన యూనిట్‌ పరిశోధనలు చేపట్టి ఫలితాలను అందించనున్నది. 

రూ. 3.05కోట్లతో చేపడుతున్న ఈ యూనిట్‌ నిర్వహణకు కేంద్రం ఏటా రూ. 50 లక్షలు కేటాయించింది. 


logo