పెనుబల్లి, మే 10 : తెలంగాణ రైతాంగ సమస్యలపై పార్లమెంట్లో గొంతెత్తి నిలదీశానని, మళ్లీ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో వేలాది మందితో రోడ్ షో నిర్వహించడంలో అంతా గులాబీమయం అయ్యింది. రోడ్ షోలో నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కల్లూరులో ఓటు గుద్దితే ఢిల్లీలో పార్లమెంట్ దద్దరిల్లాలన్నారు. మండల ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా నాపై ఉంటాయని, మరోమారు మీ బిడ్డపై అభిమానం చూపి కారు గుర్తుపై ఓటు వేయాలన్నారు. భవిష్యత్‌లో దేశ రాజకీయాల్లో తెలంగాణ ఎంపీలు కీలకమని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆస్తిని కాపాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని అన్నారు. రోడ్ షోకు తరలివచ్చిన ఆనందంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఈ నెల 13న ప్రతి వ్యక్తి కారు గుర్తుపై ఓటు వేసేలా చూడాలని నామా విజ్ఞప్తి చేశారు.
హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
అన్ని వర్గాలకు అండగా నిలిచింది గత కేసీఆర్ ప్రభుత్వమేనని, కానీ.. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు చెప్పిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఒకసారి మోసపోయాం.. ఇక మోసపోం.. కేసీఆర్‌కు అండగా ఉంటామని రోడ్ షోకు భారీ ఎత్తున తరలిరావడమే నిదర్శనమన్నారు. ఆయనకు అండగా నిలబడాలంటే 13న జరిగే ఓటింగ్‌లో ఒకటో నెంబర్ కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు.
పంటలను కాపాడిన ఘనత కేసీఆర్‌దే : మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
మండలంలో ఎన్నెస్పీ జలాలు కింద పండే పంటలకు నీళ్లు లేక ఎండిపోతుంటే.. నీళ్లు తెప్పించి పంటలను కాపాడిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గుర్తు చేశారు. కల్లూరు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, క్రీడాప్రాంగణం, నూతన హాస్పిటల్ భవనం, కొత్త బస్టాండ్, బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణం ఇలా కళ్ల ముందు కనిపించే అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా నీతి నిజాయితీగా అభివృద్ధి చేసిన ఘనత మనదేనన్నారు. కాగా.. రోడ్ షోకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, ఎంపీపీ బీరెల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, నాయకులు పెడకంటి రామకృష్ణ, కమిలీ, వెంకటరెడ్డి, సొసైటీ చైర్మన్ చావా వెంకటేశ్వరరావు, నర్వనేని అంజయ్య, రాచమళ్ల నాగేశ్వరరావు, కొరకొప్పుల ప్రసాద్, సీహెచ్.కిరణ్, దేవరపల్లి నాగప్రసాద్, మేకల కృష్ణ, భాస్కర్‌రావు, ఒబ్బన వెంకటరత్నం, దార్ల నరసింహారావు, కంభంపాటి పుల్లారావు, రమేశ్, బొల్లం వెంకటేశ్వరరావు, అజ్మీరా జమలయ్య, బానోతు కృష్ణ, సయ్యద్ రవూఫ్, ఇతిహాజ్, నవాబ్ పాల్గొన్నారు.