హనుమకొండ చౌరస్తా, మే 10: విజయ డెయిరీ యాజమాన్యం పాల రైతులకు 15 రోజుల బిల్లులను చెల్లించింది. శుక్రవారం రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులను జమ చేసింది. ‘పాల డబ్బులు ఎప్పుడిస్తారు’ అనే శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు ప్రతి 15 రోజులకోసారి పాల బిల్లులు చెల్లించాల్సి ఉండగా, 50 రోజులు దాటినా ఇవ్వడం లేదు.
ఈ క్రమంలో ఈనెల 9న హనుమకొండలోని విజయ డెయిరీ డీడీ కార్యాలయంలో ఎదుట రైతులు నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేగా స్పందించిన ఎండీ పాడిరైతుల 15 రోజుల బిల్లులు చెల్లించారు. అలాగే ఓమనైజర్ మెషీన్ను రిపేరు చేసి పంపించినట్టు విజయ కాకతీయ పాడి రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇరుకు దేవేందర్రావు తెలిపారు. పెండింగ్లో బిల్లులను కూడా చెల్లించి, 15 రోజులకోసారి పాలబిల్లులు చెల్లించి రైతులకు సహకరించాలని ఆయన డెయిరీ యాజమాన్యాన్ని కోరారు.