హరితవనంలా సర్కారు బడి

- ఉత్సాహంగా మొక్కలు నాటుతున్న విద్యార్థులు
- ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులు
ధారూరు, జనవరి 29: రాష్ట్ర ప్రభుత్వం ఆరేండ్ల నుంచి ఎన్నో ప్రణాళికలు రూపొందించి తెలంగాణకు హరితహారంతో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నది. ప్రతి పల్లెలో నర్సరీలు ఏర్పాటు చేసి అనేక రకాల మొక్కలు పెంచుతున్నది ప్రభుత్వం. దీంతోపాటు వివిధ గ్రామాల్లో పచ్చదనంపై అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తూ చెట్లతోనే వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని, వీటితోనే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందని వివరిస్తున్నారు. ధారూరు మండలంలోని మోమిన్కలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగేండ్లుగా ప్రతి ఏటా హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలలో ఇప్పటివరకు మొత్తం 1075 మొక్కలు నాటారు. వేసవి కాలంలో ఇవి ఎండిపోకుండా నీరు పోసి కాపాడుతున్నారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఆరుగురు ఉపాధ్యాయులు,6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 130 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా కలిసి మొక్కలు పెంచేందుకు చాలా కృషి చేశారు.
పాఠశాలలో నాటిన మొక్కలు సంరక్షిస్తున్నాం
మోమిన్కలాన్లోని జడ్పీహెచ్ఎస్లో హరితహారంలో భాగంగా చాలా మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకుంటున్నారు. ఇందులో పండ్లు, ఔషధ మొక్కలు నాటారు. ఇప్పటి వరకు 12వందల వరకు మొక్కలు నాటారు. నాలుగేండ్లుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాలను హరితవనంలా మార్చారు.
- బాబుసింగ్, ఎంఈవో, ధారూరు మండలం