e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జిల్లాలు సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభానికి సర్వం సిద్ధం

సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభానికి సర్వం సిద్ధం

సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభానికి సర్వం సిద్ధం

అన్ని పనులు పూర్తి
శ్రావణ మాసంలో ప్రారంభానికి ఏర్పాట్లు
ఫ్లోర్ల వారీగా శాఖలకు చాంబర్లు కేటాయింపులు
సదుపాయాలను పరిశీలించాలని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ ఆదేశాలు జారీ

వికారాబాద్‌, జూలై 15, (నమస్తే తెలంగాణ): జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణం పూర్తయింది. జిల్లాలోని ఎన్నేపల్లి వద్ద అధునాతన హంగులు, సకల సౌకర్యాలతో సర్వాంగసుందరంగా భవనాన్ని తీర్చిదిద్దారు. రెండంతస్థుల్లో వంద గదులు నిర్మించగా.. ఆయా శాఖలకు కేటాయించి అవసరమైన సదుపాయాలు కల్పించారు. రెండు రోజుల క్రితం వివిధ శాఖల అధికారులకు గదులపై అవగాహన కల్పించారు. శ్రావణమాసంలో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణతో పనులను పకడ్బందీగా చేపట్టారు. గత నెలలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి భవన సముదాయాన్ని పరిశీలించి మిగిలిపోయిన చిన్న చిన్న పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌కు తుది మెరుగులు దిద్దే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. ల్యాండ్‌ స్కేపింగ్‌, ఎలక్ట్రికల్‌ వర్క్‌, ఫ్యాన్ల బిగింపు వంటి పనులు త్వరితగతిన పూర్తి చేసి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

నూత న హంగులతో నిర్మిస్తున్న వికారాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్ర పరిధిలోని ఎన్నేపల్లి వద్ద నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్‌ భవనంలో మిగిలిన చిన్న చిన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. రెండంస్తుల్లో నిర్మించిన భవనంలో వంద గదులు ఉన్నాయి. వీటిని వివిధ శాఖలకు కేటాయించారు. రెండు రోజుల క్రితం వివిధ శాఖల అధికారులకు గదులపై అవగాహన కల్పించారు. జిల్లా అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. గత నెల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి భవన సముదాయాన్ని సందర్శించి, పరిశీలించారు. లిఫ్ట్‌ పనులతో పాటు మిగిలిపోయిన పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ల్యాండ్‌ స్కేపింగ్‌, ఎలక్ట్రికల్‌ వర్క్సు, ఫ్యాన్లు బిగింపు, ఇతర పనులు పూర్తి చేసి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ ఆయా శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వారికి కేటాయించిన చాంబర్లు పరిశీంచుకోవాలని సూచించారు. కొత్త కలెక్టరేట్‌కు వెళ్లి ఆయా శాఖలకు కేటాయించిన చాంబర్లు, గదుల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలని ఆదేశించారు. వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులు తమ చాంబర్లను పరిశీలించారు.

- Advertisement -

33 ఎకరాల్లో నూతన కలెక్టరేట్‌
పరిపాలన సౌలభ్యం కోసం 2016 అక్టోబర్‌ 11న కొత్త జిల్లాలుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్‌ కలెక్టరేట్‌ను జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటుచేశారు. నూతన కలెక్టరేట్‌ నిర్మాణానికి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఎన్నేపల్లి వద్ద సర్వే నంబర్‌ 243, 244, 245ల్లో 33 ఎకరాలు కేటాయించారు. ఇందులో జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయం నిర్మాణం పూర్తయ్యింది. 2017 అక్టోబర్‌ 11న జిల్లాకు మొదటి కలెక్టర్‌గా దివ్య దేవరాజన్‌ నేతృత్వంలో అప్పటి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కరోనాతోపాటు అనివార్య కారణాలతో నాలుగేండ్ల సమయంలో పూర్తయ్యింది. కలెక్టర్‌ పౌసుమి బసు కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం పనులను త్వరతిగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.

ఒకే దగ్గర 60 శాఖలు..
నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనంలో 60 శాఖలు ఒకే దగ్గర ఉండనున్నాయి. జీ+టూ భవనంలో వంద గదులు నిర్మించారు. ప్రతి అంతస్తులోనూ వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కల్పించారు. 300 మందితో సమావేశం నిర్వహించేటట్లు కాన్ఫరెన్స్‌ హాళ్లను నిర్మించారు. రూ.3.50 కోట్లతో ఫర్నిచర్‌ సమకూర్చారు. రూ.59 కోట్లతో నూతన కలెక్టరేట్‌ భవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మొదట రూ.32 కోట్లు కేటాయించింది. నిర్మాణ ప్రతిపాదనలు మార్పులు, చేర్పులు చేశారు. ఆ తర్వాత రూ.59 కోట్లకు నిర్మాణ వ్యయం పెంచారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో రెండెకరాల్లో పార్కులు, పార్కింగ్‌ స్థలాలు, విశాలమైన రోడ్ల నిర్మాణం పూర్తిచేశారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో..
కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, కలెక్టరేట్‌ ఏవో, సమావేశ మందిరాలు, కలెక్టరేట్‌కు సంబంధించిన వివిధ సెక్షన్లు, జిల్లా సంక్షేమాధికారి, పౌరసంబంధాల శాఖ, భూగర్భ జలవనరులు, రవాణా, వ్యవసాయ శాఖ, ఐటీఈ అండ్‌ సీ శాఖల అధికారుల కార్యాలయాలు, ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌, డిస్పెన్సరీ అండ్‌ ఆరోగ్యశ్రీ డీఐవో, ఆడియో అండ్‌ సర్వర్‌ గది, ఏటీఎం/ ఎల్‌డీఎం, ఈ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌, రికార్డు రూం, క్రెచ్‌, డైనింగ్‌ హాల్‌, రెండు వెయింటిగ్‌ హాల్‌ లాబీలు, వెయింటింగ్‌ ఏరియా, స్టోర్‌ రూం, ఎలక్ట్రికల్‌ రూం, ఏ1 సెక్షన్‌, రికార్డు రూం, అంటెడర్లకు గదులు కేటాయించారు.

ఫస్ట్‌ ఫ్లోర్‌లో ..
సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్సు ఏడీ, పశు సంవర్ధక శాఖ, విద్యా, ఉద్యాన పట్టు పరిశ్రమ, ఎస్సీ అభివృద్ధి, ముఖ్య ప్రణాళిక అధికారి, సహకార, మత్స్య, పౌర సరఫరాల శాఖ, డీఎం సివిల్‌ సప్లయ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖలకు చెందిన అధికారులకు కార్యాయాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రికల్‌ రూం, ఇదే ఫ్లోర్‌లో మంత్రి కోసం ప్రత్యేక చాంబర్‌ ఏర్పాటు చేశారు.

సెంకడ్‌ ఫ్లోర్‌లో ..
ఆడిట్‌, వయోజన విద్య, కార్మిక, యువజన క్రీడలు, జాతీయ బాలకార్మిక పథకం శాఖలు, జూనియర్‌ ఉపాధి కల్పనాధికారి, గిరిజన, మైనార్టీ, బీసీ, సంక్షేమాధికారి, ఎలక్ట్రికల్‌ రూం, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఫ్లోర్‌లో డైనింగ్‌ హాల్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌ సదుపాయం కల్పించారు. మొదటి, రెండో అంతస్తుల్లో ఖాళీగా ఉన్న గదులను కొన్ని శాఖలకు కేటాయించారు. నూతన కలెక్టరేట్‌లోకి ఫర్నిచర్‌ కూడా వచ్చేసింది. ప్రారంభానికి సర్వం సిద్ధం అయ్యింది. తుది మెరుగులు దిద్దే పనిల్లో జిల్లా అధికార యంత్రాంగం ఉంది.
ఆషాడం పూర్తి కాగానే..
ఆషాడ మాసం పూర్తి కాగానే శ్రావణంలో నూతన కలెక్టరేట్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని శాఖలకు సొంత భవనాలు ఉండడంతో వారు కొత్త కలెక్టరేట్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రధానంగా జిల్లా పంచాయతీ, ఉద్యానవన శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు ఇప్పటికే సొంత భవనాలు ఉన్నాయి. వీరికి కేటాయించిన చాంబర్లు, ఇతర శాఖలకు కేటాయిస్తారా.. లేక ఈ శాఖలనే కొత్త కలెక్టరేట్‌కు మారుస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. మిగిలిన శాఖలన్నీ సమీకృత కలెక్టరేట్‌లోకి రావాలిందేనని జిల్లా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఆయా శాఖల అధికారులు తమకు కేటాయించిన చాంబర్లను సందర్శిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభానికి సర్వం సిద్ధం
సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభానికి సర్వం సిద్ధం
సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభానికి సర్వం సిద్ధం

ట్రెండింగ్‌

Advertisement