Vasthu Shastra | స్థల శుద్ధి అంటే.. భూమిని తవ్వి, మట్టి మొత్తం ఎత్తిపోయాలా? అసలు స్థల శుద్ధి అవసరమా? ఈ విషయంలో వాస్తు ఏం చెబుతున్నది?
– పి. శ్రీధన్, కొడకండ్ల
స్థలాన్ని శుద్ధి చేయడం అవసరమే! వంట వండేముందు.. పాత్రను శుభ్రం చేసుకుంటాం. అది అటక మీద బోర్లించినదైనా సరే, తిరిగి శుద్ధి చేసుకునే వాడుకుంటాం. అలానే.. స్థలం బాగా అనిపించినా, ఇతరులు గతంలో ఇల్లు కట్టిన స్థలమైనా తప్పక బాగు చేసుకొని వాడుకోవాలి. భూమిని తవ్వడం అనేది పాత ఇంటి విషయంలో తప్పనిసరి. తొలగించిన ఇంటి పునాదులు, పిల్లర్ ఫుటింగులు, పాత సంపులు, సెప్టిక్ ట్యాంకులు, లెట్రిన్ కుండీలు, గోడ కింది రాళ్లు.. ఇలాంటివన్నీ తప్పకతీసేయాలి. ముఖ్యంగా స్టీలు (ఇనుప చువ్వలు) భూమి లోపల మిగిలిపోకుండా జాగ్రత్త పడాలి. ఎన్నో ఏళ్లుగా నీళ్లతో, చెత్తతో అపరిశుద్ధమైన స్థలాన్ని ఎంత ఖర్చయినా సరే చదును చేయాల్సిందే. భూమి గట్టిదనం తేలేవరకు ఒకటి రెండు అడుగుల మందమైనా తొలగించాలి. చెట్టు పాదును సారవంతం చేసి విత్తు నాటితే ఎంత బాగుంటుందో.. స్థల శుద్ధిని కూడా అంత గొప్పగా చేసి, ఆ పవిత్ర స్థలంలో మాత్రమే నిర్మాణం చేపట్టాలి.
మాది పడమర వీధి ఇల్లు. మా తూర్పు కాంపౌండు అవతలి స్థలం ఎత్తుగా ఉంటుంది. అలా ఉండొచ్చా? ఉండకూడదంటే, ఏం చేయాలి?
– ఎన్. చందన, గోపన్పల్లి
చాలా కాలనీల్లో ఇతరుల స్థలాలు ఎత్తుగా ఉండటం చూస్తుంటాం. వాస్తవానికి ఇల్లు కట్టేకన్నా ముందే.. అంటే, స్థలం నిర్ధారించేటప్పుడే ఆ పరిసరాలు మనకు సానుకూలమా. ప్రతికూలమా? అనేది ఆలోచించాలి. తూర్పు భాగం ఎత్తుగా ఉంది అంటున్నారు. అది ఇతరులదే అయినా, ఆ దిశలో ఎత్తు మీకు దోషమే! అయితే, తూర్పు భాగం ఖాళీ స్థలం పొడవుగా ఉంటే.. ఒక ఆరు అడుగులు తూర్పు సందు వదిలి, తూర్పు కాంపౌండు వెనక్కి జరిపి.. అంటే, తూర్పు ఖాళీ వదిలి కట్టుకోవాలి. దానిలో మొక్కలు నాటుకోండి. మన తూర్పు హద్దు చేసేటప్పుడు పడమర కన్నా ఖాళీ ఎక్కువ ఉండేలా చూడాలి. దీనివల్ల చెడు ఫలితాలు రాకుండా ఉంటాయి.
అనుభవం-శాస్త్రం వేరువేరు కదా! అనుభవమే శాస్త్రం అవుతుందా? వివరంగా చెప్పండి.
– ఎం. శివశంకర్, హుజూరాబాద్
అనుభవం వేరు. శాస్త్రం వేరు. అను.. అంటే, తర్వాత. భవం.. అంటే, పుట్టుక. తరువాత పుట్టేది అనుభవం. ఒకానొక అంశంలో అనుభవమే జ్ఞానం (పాఠం). శాస్త్రం అనేది అన్ని కాల పరీక్షలతో స్థిరత్వాన్ని, హేతుబద్ధతను, అనుసరణీయతను, ప్రయోజకత్వాన్ని, శాసనత్వాన్ని కలిగి ఉంటుంది. శాస్త్రం అంటేనే.. పాటించతగినదిగా భావించాలి. అలా శాస్ర్తాల పుట్టుక అనాదిలోనే జరిగింది. ప్రతి మనిషికి ఏదో ఒక విధమైన అనుభవం ఉంటుంది. మన అనుభవంతో శాస్ర్తాన్ని ముడిపెట్టడం, మన అనుభవంలో చూసింది శాస్త్రంగా చెప్పడం.. తెలివిలేని తనమే! అలాంటి వ్యక్తుల రాతల వల్లే నేడు వాస్తు పట్ల అవహేళన, తక్కువ చూపు ఏర్పడింది. సంగీత శాస్త్రం, నాట్యశాస్త్రం, శకున శాస్త్రం లాగే.. వాస్తు కూడా గొప్ప శాస్త్రం. ఇది మానవతీతమైంది. నిగూఢమైంది.
మాకు వాయవ్యం పెరుగుతూ రోడ్డు పోయింది. ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
– కె. ధనలక్ష్మి, నార్కెట్పల్లి
వాయవ్యం మనసుపై నేరుగా ప్రభావం చూపుతుంది. మనసు అనేది.. ఒక రూపరహితమైన, మహోన్నత శక్తిగతమైన అంతరింద్రియం. ఇది వాయవ్యం దిశకు త్వరగా ఆకర్శితమవుతుంది. కాబట్టి వాయవ్యంలోని వక్రతలు.. చంచల స్వభావానికి హేతువులు అవుతాయి. వాయవ్యం పెరగడం వల్ల ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలు చెడిపోతాయి. అందరిలోనూ ఒక ఘర్షణ స్వభావం నెలకొంటుంది. వాయవ్యం ఎలా పెరిగిందో.. అలాగే మీ కాంపౌండ్ కట్టారు. అది చాలా విరుద్ధం. వెంటనే, మీ ఇంటికి ఈశాన్యంలో ఎంత స్థలం ఉందో, అంతే కొలతను అనుసరించి వాయవ్యంలో ఇంటికి – ప్రహరీకి మధ్య పెట్టుకొని కొత్త కాంపౌండు కట్టుకోండి. కొద్ది నెలల్లోనే మీ ఆంతరంగిక సమస్యలు, బంధుమిత్రులతో మనస్పర్ధలు తప్పక తొలగిపోతాయి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?