Vasthu Shastra | ఇంట్లో వేసే మెట్లు.. మాస్టర్ బెడ్రూమ్లు తగులుతూ వేయవచ్చా? లేదా గ్యాప్ ఉండాలా?
– అలివేణి, మారేడ్‌పల్లి
డూప్లెక్స్ ఇల్లు కడుతున్నప్పుడు ఇంటి లోపలి మెట్లు దక్షిణం మధ్యలో కానీ, పడమర మధ్యలో కానీ పెడుతుంటారు. అలాంటప్పుడు మెట్ల వైశాల్యం ఇంటి విభజనలో హాలు – పడకగదులు శాస్ర్తోక్తంగా నిర్ణయించుకోవాలి. ఆ విభాగం సరిగ్గా జరిగాక.. మెట్లు పడకగదికి తగిలినా ఇబ్బంది ఉండదు. కొన్ని గదుల విభజనలో మెట్లు అటు పడమర ఉచ్ఛ భాగంలోకి కూడా వెళ్లవచ్చు. ఇంట్లోకి మెట్లు వచ్చాక.. గదులకు తగిలిరావడం – తగలకుండా రావడం అనేది నియమం కాదు. సవ్యమైన రీతిలో తగిన స్థానం చూసుకొని మెట్లు వేయడం.. మెట్లకు తగిన బ్యాలెన్స్ చూసుకొని డూప్లెక్స్ నిర్మాణం చేయడం..
తదితర అంశాలు జాగ్రత్తగా చూసుకుంటే చాలు.
మా తమ్ముడు మా ఇంటికి తూర్పులో ఎత్తుగా అపార్ట్మెంట్ కడుతున్నాడు. అలా ఉండొచ్చా? మేం ఎప్పుడో వేరుపడ్డాం.
– డి. అరవింద్ మెహతా, మేడ్చల్
ఇండ్లు వేర్వేరుగా నిర్మించుకొని ఎవరి ఇష్టంగా వారు జీవిస్తున్నప్పుడు ఎవరు ఎక్కడున్నా.. తప్పులేదు. కిచెన్లు వేరుకదా! ‘పాలివాడు’ అనేసరికి మీకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవన్నీ ఒక కుటుంబంగా ఉన్నప్పుడు.. ఒక ఇంట్లో ఉన్నప్పుడు.. ఒక ప్రాంగణంలో ఇద్దరూ కలిసి ఇండ్లు కడుతున్నప్పుడు మాత్రమే చూసుకోవాలి. పైగా మనకు తూర్పులో-ఉత్తరంలో ఒక్కోసారి ఎత్తయిన అపార్ట్మెంట్లు కూడా వస్తుంటాయి. అలా అని, వారిని అంతెత్తు కట్టొద్దు అనడం సరికాదు. మనం నివసించే ఇంటికి లేదా అపార్ట్మెంటుకు కాంపౌండ్ ఉంటే.. ఆ నిర్మాణం చుట్టూ ప్రదక్షిణ పూర్వక స్థలం ఉంటే, ఇతర (పక్కింటి) నిర్మాణాలు దోషంకావు. ప్రకృతిగతమైన తూర్పు కొండలు, గుట్టలు, ఎత్తు ప్రదేశాలు.. భౌగోళికంగా మన హద్దును ఆనుకొని ఉంటే.. అక్కడ నివాసం అశుభాన్ని ఇస్తుంది.
ఇంటి లోపల నైరుతి – వాయవ్యం – తూర్పు భాగాలను ఎత్తు పల్లాలుగా చేసి కట్టుకోవచ్చా?
– ఎం. సుగుణ, ఉప్పల్
వాస్తుపట్ల సరైన అవగాహన లేనివాళ్లు చేసే దిక్కుమాలిన ప్రయోగాలు ఇవన్నీ. ఇంటిని ఇంటిగా కట్టాలి. ఈశాన్యం పల్లంగా ఉండాలి. నైరుతి ఎత్తుగా ఉండాలి అనుకుంటూ.. కొందరు ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్ను ఎత్తు చేయడం, ఈశాన్యం గదిని లోతు చేయడం చేస్తుంటారు. అది సరైన విధానం కాదు. ఎత్తు పల్లాలు భూమికి వర్తిస్తాయి. దానివల్ల వచ్చే ప్రయోజనం మొత్తం స్థలంమీద.. గృహం మీద ఉంటుంది. అలాఅని అన్నీ అలా ఉండవు. స్థలం దిశకు ఉండి, సమతలంగా ఉన్న ఇల్లు చక్కగా కట్టాలి. లోపల దిశానుకూలంగా ఎత్తు – పల్లం చేసినా.. ఇంటి లోపలి ఆవర్ణం (ఊర్జ) దెబ్బతింటుంది. మీరు ఇంటి ఫ్లోరింగ్‌ను సమతలంగా ఉండేలా కట్టుకోండి. ముఖ్యంగా ఇంటి ప్రధాన వీధి నుంచి మన ఫ్లోరింగ్ ఎంత ఎత్తులో ఉండాలి అనేది చూసుకొని కట్టండి చాలు.
మాకు దక్షిణం రోడ్డు – తూర్పు రోడ్డు స్థలం ఉంది. అందులో ఇల్లు కట్టుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు?
– కె. సుందరం, షాద్‌నగర్
మీ స్థలాన్ని ఆగ్నేయం బ్లాకు అంటారు. దిశలు – వీధుల దృష్ట్యా.. అది ఆగ్నేయ ప్రభావం కలిగిన స్థలం అవుతుంది. మీ స్థలానికి ఉన్న వీధులలో దక్షిణం రోడ్డు తూర్పు వీధికన్నా తగ్గులో ఉంటే.. అక్కడ తూర్పు ముఖద్వారంతో ఇల్లు కట్టుకోవాలి. అయితే దక్షిణం వైపు తప్పక గేటు పెట్టుకోవాలి. మీరు కింద కాకుండా పైన నిర్మాణం చేపట్టాలని ఉందని రాశారు. అది కూడా మంచి నిర్ణయమే! అప్పుడు పైన తూర్పు – ఉత్తరం బాల్కనీలు వచ్చేలా చేసి, తూర్పునకు – ఉత్తరానికి – కిచెన్‌కు దక్షిణంలో ద్వారాలు ఉండేలా ప్లాన్ చేసి నిర్మించుకోవచ్చు. కింద దక్షిణం వైపు షాపులు వేసుకోవాలని ఉందని కూడా చెప్పారు. తప్పక వేయండి. అయితే, దక్షిణ – ఆగ్నేయంతో గేటు పెట్టాలి. ఉత్తరం వైపు కారు పార్కింగ్ ఏర్పాటు చేసుకోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంట్లో ఫాల్స్ సీలింగ్ అన్నిచోట్లా ఒకే విధంగా వేయించాలా? కొన్ని గదులు వదిలేయవచ్చా?
Vasthu Shastra | ఆగ్నేయం ఇంటికి సెల్లార్ ఉండవచ్చా?
Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా?
Vasthu Shastra | మా కాలేజీకి ఈశాన్యంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది.. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?