Vasthu Shastra | మొదటి అంతస్తులో తూర్పు బాల్కనీలోకి ఇల్లు పెంచి కట్టుకోవచ్చా? ఆ అవకాశం ఉంటే.. ఎంత వరకు పెంచుకోవచ్చు?
– బి. ధనలక్ష్మి, మేడ్చల్
మీరు పంపిన ప్లాన్ చూశాను. తూర్పు బాల్కనీలోకి మీ హాలు భాగాన్ని.. అంటే, తూర్పు భాగం పెంచారు. అప్పుడు మీ ఇంట్లో తూర్పు-పడమర పెరుగుతుంది. ఆగ్నేయం-ఈశాన్యం తెగిపోతాయి. తద్వారా భుజాలు తెగిన శరీరంలా ఉంటుంది గృహం. మన అవసరాలు మనకు చాలా ముఖ్యంగానే ఉంటాయి. వాటి ముందు శాస్ర్తాలు, చట్టాలు చిన్నవిగా అనిపిస్తాయి. కానీ, వాస్తు వచనం దాటిపోవద్దు. తప్పక వినాల్సిందే! తద్వారా కాస్త కష్టం అనిపించినా.. దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇంటికి తూర్పు భాగం – ఉత్తర భాగం తప్పక ఆకాశాన్ని చూసే స్థలం ఉండాలి. అంతా లోపలికే ఆక్రమించుకుంటే పూర్ణత్వం ఉండదు. చాలామంది వాడుకునేదే గొప్పది అనుకుంటారు. కానీ, ఖాళీ స్థలం లేకుండా మనోస్థాయిలో వృద్ధి జరుగదు. వెంటనే తూర్పు బాల్కనీ ఓపెన్ చేయండి.
సింహద్వారం ఎదుట స్విమ్మింగ్‌పూల్ ఉండొచ్చా? దానిపై నుంచి నడిచి రావచ్చా? ఫామ్‌హౌజ్ కడుతున్నాం.
– కె. సరస్వతి, బుద్వేల్
ఫామ్‌హౌస్‌లో స్విమ్మింగ్‌పూల్ పెట్టుకోవాలంటే.. అందుకు అనుకూలమైన స్థలం ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి – స్విమ్మింగ్‌పూల్‌కు మధ్య తగినంత దూరం ఉండటం మంచిది. ఎలాగూ ఇంటి బయట కట్టాలి అనుకున్నప్పుడు.. ఎట్టి పరిస్థితుల్లోనూ సింహద్వారానికి ఎదురుగా రాకూడదు. మొత్తం స్థలానికి ఈశాన్యంలో కానీ, ఉత్తరం మధ్యలో కానీ, తూర్పు మధ్యలో కానీ కట్టుకోవాలి. అలాగే దానికి తగిన డెక్-డ్రెస్ చేంజింగ్ గదులు.. స్విమ్మింగ్‌పూల్‌కు పడమర కానీ, దక్షిణం కానీ ఏర్పాటు చేయాలి. ఇంటి నిర్మాణం మొత్తం ఫామ్ భూభాగంలో నైరుతి భాగాన కట్టుకునేట్టు అయితే.. ఆ ఇంటికి ప్రత్యేకంగా కాంపౌండు నిర్మించి వాడండి.
దక్షిణం పల్లంగా ఉన్నప్పుడు స్థలాన్ని మట్టితో నింపి, ఇల్లు కట్టుకోవచ్చా?
– బి. మనోహర్, చౌటుప్పల్
ముందుగా మీరు ఆ జాగాలో ఇల్లు కట్టవచ్చా, లేదా? అనే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే, దక్షిణం చాలా లోతుగా ఉన్నట్టయితే.. మీరు ఉత్తరంతో సమానంగా ఎంత ఎత్తు నింపుతుంటే అంత ఎత్తయిన లోతూ తయారవుతుంది. కేవలం నాలుగు నుంచి ఐదు – ఆరు అడుగులు ఎత్తుగా చేసుకోవాల్సి వస్తే ఇబ్బంది లేదు. అలాగే అంతకన్నా ఎక్కువ లోతున్నా.. పక్కన (దక్షిణంలో) ఇతరులు ఇల్లు కట్టుకొని ఉన్నా, లేదా ఉత్తరోత్రా కట్టుకునే ఇంటి భాగం అయినా కూడా, మీరు మీ స్థలంలో నైరుతి నింపి, కాంపౌండు ముందు ఎత్తుగా చేసి, అందులో ఇల్లు కట్టుకోవాలి.
మాకు తూర్పు డౌన్‌తో పొడవైన స్థలం ఉంది. పడమరలో ఇల్లు కట్టి, ముందు భాగాన్ని మొత్తం స్లాబ్ చేసుకొని ‘లాన్’ వేయవచ్చా?
– కె. శకుంతల, మంచిరేవుల
తూర్పు-పడమర దీర్ఘచతురస్ర స్థలంలో ఇల్లు కట్టాలి అంటే.. స్థలం వైశాల్యంలో ఇంటి నిర్మాణభాగం ఎంతశాతం వస్తుంది అనేది లెక్కించాలి. తూర్పు అధిక పొడవుతో స్లాబ్ పెంచుకొని, స్థలం పెంచుకోవాలనే మీ ఆలోచన మంచిదే! కానీ, తద్వారా మనం ప్రస్తుతం ఉంటున్న లేదా కట్టాలి అనుకుంటున్న ఫుట్‌ప్రింట్ పూర్తిగా వెనక్కి వెళ్లి పోకుండా చూడాల్సి ఉంటుంది. మన నివాసానికి అనుకూలమైన కొలతతో ఒక హద్దు ఏర్పరచాలి. మీ స్థలం తూర్పు వాలుగా ఉంది కాబట్టి, ఇంటి స్థలం కొలతలో ఐదు అడుగుల వరకు తగ్గించి, తూర్పునకు పెంచుకోండి. లేదా చిన్న కాంపౌండు ఏర్పాటు చేసుకోండి. ఎంత స్థలం ఉన్నా.. ముఖానికి తగిన బొట్టు పెట్టుకున్నట్టు ఉండాలి. ఏదైనా ఎక్కువ కాకూడదు. తక్కువా కాకూడదు.