Vasthu Shastra | మేము తూర్పు దిక్కు స్థలం కొన్నాం. అది మా ఇంటికన్నా వెడల్పు ఉంది. దాన్ని అలాగే ఉంచుకోవచ్చా? మార్పులు చేయాలా?
– కె. నిర్మల, జగద్గిరిగుట్ట
తూర్పు భాగం కొనడం మంచిదే. దాన్ని ఎవరి పేరుమీద కొన్నారు? ఇప్పుడు ఉన్న స్థలం కూడా ఆ వ్యక్తి పేరు మీదే ఉన్నదా? రెండూ ఒకరి పేరు మీదనే తీసుకున్నప్పుడు, ప్రస్తుతం ఉన్నదాని కన్నా ఆ స్థలం పెద్దగా ఉంటే.. కొత్తగా కొన్న స్థలాన్ని కమర్షియల్గా వాడుకోవచ్చు లేదా నిర్మాణం చేసి అద్దెకు ఇవ్వవచ్చు. పిల్లల పేర్లమీద కూడా నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ఒకే పేరు మీదనే కొంటే.. ఒకే యజమాని ఆ కొన్న స్థలంలో నిర్మాణం చేసి వాడుకుంటే, ఆ కొత్త స్థలం ఆగ్నేయం పెరగడం వల్ల శత్రు నడకలు వస్తాయి. కాబట్టి, ఇతరుల పేరు మీదికి ఆ స్థలాన్ని మార్చి, మరెవరో వాడుకునేలా నిర్మాణం చేయాలి. ఒక్కరే వాడుకోవాలి అనుకుంటే.. ఆగ్నేయం పెరిగిన స్థలాన్ని.. అంటే, ఆ కొత్త స్థలం దక్షిణం భాగాన్ని తెంపు చేసి, ఉన్న ఇంటి దక్షిణం పారుతో సమానంగా చేసి, ఒక్క యజమానే రెండు ఇండ్లనూ వాడుకోవచ్చు. అన్నీ సరిగ్గా చూసుకొని నిర్ణయం తీసుకోండి. వాస్తును అనుసరించండి.
మాది పడమర ముఖం ఇల్లు. ఇంట్లో ఒక భాగం షటర్గా మార్చాలి. ఎటు దిక్కు చేయమంటారు?
– ఎస్. వెంకటేశ్, మెదక్
ఆ ఇంట్లో ఉంటూనే ఒక భాగం షెటర్గా మార్చాలి అనుకుంటే.. ఇంటి పడమర భాగాన్ని కట్చేసి, షటర్ వేసుకోవచ్చు. అంటే ఇంట్లో నైరుతి భాగం, అలాగే వాయవ్య భాగం వదిలి.. మధ్యభాగం పది లేదా తొమ్మిది అడుగులు ఉంటే, దానిని పడమర ముఖానికి షటర్ పెట్టి, లోతు కూడా పది అడుగులు తీసుకొని, షాపు చేసుకోవచ్చు. మధ్యభాగాన్ని షాపుగా చేసినప్పుడు దాని లోతు.. అంటే, తూర్పు – పడమర కొలత మాస్టర్ బెడ్రూమ్ కొలతకన్నా ఎక్కువ పొడవు తీసుకోవద్దు. దానితో సమానంగా కానీ, దానికన్నా తక్కువ పొడవుగా కానీ తీసుకోవచ్చు. పడమర షాపుగా చేసుకొని, దానిలో నుంచి ద్వారాన్ని ఇంట్లోకి పెట్టుకోవద్దు. తప్పకుండా బయటి నుంచి బయటికే నడుస్తూ షాపు నిర్వహించాలి. ఆ షరతుకు ఇష్టమైతేనే.. ఆ విధంగా మార్చుకోవాలి.
ఇంట్లో ఫాల్స్ సీలింగ్ అన్నిచోట్లా ఒకే విధంగా వేయించాలా? కొన్ని గదులు వదిలేయవచ్చా? అసలు అవసరమే లేదా?
– ఇ. కుమార్, గుండాల
ఇంటికి ఫాల్స్ సీలింగ్ తప్పనిసరి కాదు. హాలులో సోఫా స్థలంలో నెత్తుల మీద, పడక గదులలో నిద్రించే స్థలానికి పైన అడ్డంగా బీములు వచ్చినప్పుడు ఫాల్స్ సీలింగ్ అవసరం పడుతుంది. అందం వేరు.. అవసరం వేరు కదా! కిచెన్లో ఫాల్స్ సీలింగ్ అవసరమే ఉండదు. అక్కడ బీము ఇబ్బంది లేకుంటే.. అలానే వదిలేయవచ్చు. లేదూ .. తప్పక ఫాల్స్ సీలింగ్ వేసుకుంటాం అంటే, మాస్టర్ గదితోపాటు అన్ని గదుల్లోనూ ఫాల్స్ సీలింగ్ వేసుకోండి. ఒకే విధమైన సీలింగ్ అనేది కాదు.. మనకున్న డిజైన్లో ఎత్తు – పల్లాలుగా ఎక్కడైనా వేసుకోవచ్చు.
మాది వ్యవసాయ కుటుంబం. ఇంటి బయట స్టోర్ రూమ్ ఏ దిశలో కట్టాలి?
– ఎ. రమేశ్, కోరుట్ల
వ్యవసాయదారుల కుటుంబం అయితే.. స్టోర్ రూమ్ తప్పక అవసరం అవుతుంది. మీకు ఇంటి ప్రహరీ లోపల ఉపగది కావాలంటే.. నైరుతి దిశలో కట్టండి. ట్రాక్టర్ ఇతర వాహనాలు వెళ్లాలి అనుకుంటే.. వాయవ్యం లేదా ఆగ్నేయ భాగంలో స్టోర్ రూమ్ వేసుకోవచ్చు. దోషం లేదు. ఎక్కడ ఉపగది కట్టినా.. ఇంటికి, ప్రహరీకి అంటకుండా కట్టండి. అప్పుడు దానికది విడిగా ఉంటుంది. ఎలాంటి దోషాన్నీ కలిగించదు. నైరుతి దిశలోనే కట్టాలి అనే నియమం లేదు.పడమర – దక్షిణంలో అంత ఖాళీ స్థలం లేనప్పుడు ఉత్తర భాగంలో ఖాళీ ఉంటే.. ఉత్తర-వాయవ్యంలో, పడమర ఇంటి పారుతో సమానంగా స్టోర్ రూమ్ కట్టండి. ఒదిగి ఉంటుంది.