Vasthu Shastra | కొత్త ఇంట్లో అల్లుడి చేత గృహ ప్రవేశం చేయించవచ్చా? ఇల్లు వారి పేరుమీద లేదు.
– బి. ఈశ్వర్, మేడ్చల్
ఎవరు చేసినా.. వాళ్లు దంపతులై ఉండటం ప్రధానం. మీకు అవకాశం లేదు కాబట్టి, మీ కూతురు – అల్లుడి చేత పూజాదికాలు చేయించడం దోషమేం కాదు. ‘ఉన్న ఒక అబ్బాయీ దగ్గరలో లేడు.. రాడు!’ అంటున్నారు. మీరు ఒంటరివారు. కాబట్టి తప్పదు. అందుకు శాస్త్రం అడ్డు చెప్పదు. ఇంటిని ముహూర్తవేళ ఆరంభించుకొని, నివాసానికి అనుజ్ఞ పొందడం చాలా ప్రధానం. ఆ సమయంలో యజమానులే కూర్చోవాలి, వాళ్లే ఉండాలి అనుకుంటే.. అన్ని సమయాల్లో కుదరకపోవచ్చు. ఆచార సంప్రదాయాలను అనుసరించి, శాస్త్రీయంగా గృహ ప్రవేశం చేయండి. మీకు అంతా శుభమే జరుగుతుంది.
నిజానికి, వాస్తు ఎవరి కోసం? లోకంలో మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారు. ఎవరైనా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవచ్చు కదా!
– పి. కావ్యశ్రీ, కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్
మంచి ప్రశ్న. సమాజంలో అక్రమార్కులు, విక్రమార్కులు ఉంటారు. దొంగలు, మహోన్నత వ్యక్తిత్వం కలిగినవాళ్లూ ఉంటారు. డబ్బుంటే.. ఎవరైనా.. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవచ్చు. అప్పుడు ఆ గృహం చెడ్డవారిని మారుస్తుందా? అనేది మీ సందేహం. అంతేనా? శాస్త్రం అందరికోసం ఉన్నది. అంటే.. మనిషి కోసం శాస్త్రం. మనిషి విజయం కోసం శాస్త్రం. కుటుంబ శాంతి కోసం, సమాజ లక్ష్యం కోసం వాస్తు శాస్త్రం వచ్చింది. వాస్తు పాటించని వాళ్లు అంటారా.. అసలు వాళ్లు ఈ శాస్త్రం ఒకటి ఉంది అని, దీనిలో ఒక లోతైన సృష్టి జ్ఞానం దాగుందని కూడా ఆలోచించరు. అల్ప జ్ఞానంతో (తమకే తెలుసు అనే పోకడతో) వాళ్ల బుద్ధి చెప్పినట్టు అనేక వక్రతలతో ఇండ్లు కడుతుంటారు. బంధువులో, స్నేహితులో.. ‘కోట్లు ఖర్చు చేసి అంతపెద్ద ఇల్లు కడుతున్నావు. వాస్తు చూపించుకో రాదూ!’ అని హెచ్చరిక చేసినా, ముఖం చిట్లించుకుంటారు. దగ్గరికి కూడా రానీయరు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది.. వాళ్లు చెడ్డవాళ్లు అని కాదు. వాళ్లు గొప్పవాళ్లు అని కూడా కాదు. ఎవరి స్వభావాన్ని (వారి వారి కర్మను) బట్టి వాళ్లు ఇండ్లు కట్టుకుంటున్నారు. పుట్టుకతో వచ్చే స్వభావం అతణ్ని వీడిపోవడం కష్టం. ఎన్నో ఎగుడు దిగుడులు చూసి, పడి – లేచి – పడి కొందరు పరివర్తన పొందుతారు. కొందరు బతికినంత కాలం పొందరు. డబ్బు ఉంటే, ఎంతో ప్రతిభ ఉంటే, పలుకుబడి ఉంటే, స్థలాలు ఉంటే కాదు.. వారి స్వభావం, స్థితి మారడానికి కాలం దోహదం చేస్తే.. అతను వాస్తు గృహం కట్టగలుగుతాడు. ఇది అంత తొందరగా అందరికీ అర్థం కాదు. బుద్ధిః.. కర్మానుసారిణి. పెద్దలు చూపిన మార్గంలో నడవడం విజ్ఞుల లక్షణం.
ఇల్లు కట్టేటప్పుడు ఇంటిచుట్టూ రాతి పునాది కట్టాలా? ఎలాగూ బీములు పోస్తాం కదా?
– డి. అర్చన, కొల్లూరు
అందరూ ఇండ్లు కడతారు. కానీ, దానిని ఎలా కట్టాలి? ఎన్ని సుగుణాలతో నిర్మించాలి? అనే విషయంలో కొందరు నిర్లక్ష్యం వహిస్తారు. ప్రహరీలు ఎందుకు? పునాదులు ఎందుకు? మంచి మట్టి పోయడం ఎందుకు? అనుకుంటారు. ఒక చంటి బిడ్డను ఎలా పెంచుతామో.. అలాగే ఇంటినీ నిర్మించాలి. మంచి ఆహారం, రక్షణ, గుణగణాలు రంగరించి బాబును పెంచినట్టు.. కొత్త గృహం తయారు కావాలి. పిల్లర్ నుంచి పిల్లర్‌ను కలుపుతూ ఇంటి ఫుట్ ప్రింట్ ఏరియాను తప్పకుండా రాతి పునాదితో.. లోతుగా భూమిని తెంచి కట్టాల్సిందే! అదే మీ ఇంటికి గట్టి రక్షణ ఇస్తుంది. ప్లింత్ బీములు గోడలను కుంగకుండా ఆపుతాయి. అవి నేలమీద ఉంటాయి కాబట్టి. కానీ, ఇంటికి నాలుగు మూలలు కలిపే పునాది.. గోడ జీవితాలకు ఆరోగ్య రక్షణ కల్పిస్తుంది. అందుకే, రాతి పునాది కట్టాల్సిందే!
ఇంట్లో సంతానలోపం ఉంటే.. ఏ మార్పులు చేయాలి?
– బి. వసుంధర, మేడిపల్లి
ముందుగా ఆ గృహం ఉండే స్థానం గొప్పగా ఉందా, లేదా? అనేది చూడాలి. కొందరిలో జన్మతః జన్యుపరమైన లోపాలు వస్తాయి. అలాంటివి పోవాలంటే.. మనం ఉండే వాతావరణం, మనం తీసుకునే ఆహారం, మన అలవాట్లు, ఆలోచనల్లో మార్పు తప్పనిసరి. చాలా కుటుంబాలు ఈశాన్య లోపం, నైరుతి దోషాలు ఉన్న గృహాల్లో నివసిస్తున్నాయి. ఆధునికత పేరుతోనో, ఆనందం పేరుతోనో.. మనసుకు నచ్చినట్టు కట్టి/ కట్టించుకొని జీవితంలో ప్రధానమైనవన్నీ కోల్పోతున్నారు వారు. సంతానం నిలువకపోవడం అనేక విధాలు. కొందరికి గర్భధారణ నిలువదు. కారణం.. ఆ గృహంలో ఆగ్నేయంలో పెనుదోషాలు ఉండటం. కొన్ని ఇండ్లల్లో సంతానం కలిగినా.. ఎక్కువకాలం ఉండదు. కారణం.. ఈశాన్యం లోపం. మీరు ఆగ్నేయం – వాయవ్యం, ఈశాన్యం – నైరుతి లోపాలు ఉన్న ఇంట్లో ఉంటున్నారు. అన్నీ సవరించుకోండి. లేదా.. అద్దె ఇల్లు అయినా సరే, మరోచోటికి మారిపోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vaasthu Shastra | ఒక్క కొడుకు ఉంటే.. అతనికి తూర్పు రోడ్డు ఇల్లు మాత్రమే కట్టి ఇవ్వాలా?
Vasthu Shastra | ఆగ్నేయం ఇంటికి సెల్లార్ ఉండవచ్చా?
Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా?
Vasthu Shastra | మా కాలేజీకి ఈశాన్యంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది.. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?
Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?