Vasthu Shastra | తూర్పులో మా పాత ఇల్లు ఉంది. పడమర ఖాళీ స్థలంలో మా కోసం ఇల్లు కట్టుకొని ఉండొచ్చా? తరువాత తూర్పు కలుపుతాం.
– జి. మధుకుమార్, కొత్తూరు
ఇంటి స్థలాన్ని నిర్ణయించాక అందులో రెండు పాత గదులు అలాగే ఉంచి, వాటికి పడమరవైపు ఇంటి నిర్మాణం చేపట్టడం తప్పు అవుతుంది. తాత్కాలికంగా అయినా సరే, మీ మొత్తం స్థలంలో తూర్పు గదులు ఉంచి, పడమరలో ఇంటికోసం పూనుకుంటే.. ఆ పని ముందుకు సాగదు. సరికదా.. మీ భూమిపూజ కూడా మంచి స్థలంలో జరగదు. ముందుగా స్థలమంతా ఖాళీ చేసి, దానిని శుద్ధిచేయండి. నాలుగు మూలలను మెట్నకు సరిచేసి, మార్కు చేయండి. తరువాత దానిలో ఎంత అవసరమో, ఎంత నిర్మాణం చేయగలరో.. చూసుకొని శాస్త్ర ప్రకారం నక్ష తయారు చేసుకొని మంచి ఇల్లు కట్టండి. మీరు వేరే అద్దె ఇంటికి వెళ్లండి. అప్పుడు అన్నీ శుభకరంగా ఉంటాయి.
మాకు తూర్పున ఇల్లు ఉంది. పడమర చాలా ఖాళీ స్థలం ఉంది. దానికి ఒక రోడ్డు తగులుతుంది. అలా ఉండొచ్చా?
– డి. కవిత, ధర్మపురి
మీది తూర్పు రోడ్డున్న ఇల్లు. మీరు పంపిన నక్ష ప్రకారం.. మీకున్న పెద్ద స్థలంలో ఆగ్నేయ భాగంలో మీ ఇంటిని కట్టారు. తూర్పు – ఈశాన్యంలో గేటు పెట్టారు. పైగా మీ ఇంటిని తూర్పు హద్దు మీద కట్టారు. అలాగే, దాని ముఖం ఆగ్నేయం తిరిగి ఉంది. మీకు పడమరలో పెరడు జాగా చాలా ఉంది. ఇవన్నీ దోషాలే! మళ్లీ మీరు కొన్న పడమర స్థలానికి దక్షిణ – నైరుతిలో వీధిపోటు ఉంది. ముందుగా మీరు నైరుతి వీధిపోటు స్థలాన్ని పూర్తిగా వదిలి, దాని వీధిపోటును లోపలికి తీసుకుంటే.. అప్పుడు అది తెంపు చేసిన స్థలానికి తూర్పు రోడ్డు అవుతుంది. అలాగే, ఆగ్నేయ భాగాన్ని అంటే.. మీ ఇంటిని అమ్మేయండి. దానిని కమర్షియల్గా వాడుకుంటే మంచిది. లేదా పూర్తిగా తీసివేసి, మళ్లీ సరైన దిశలో ఇల్లు కట్టుకోండి. అలా
కాకుండా, వీధిపోటు భాగాన్ని సరిచేసి.. దానిని, ఆగ్నేయం ఇంటిని అమ్మేయండి. తూర్పు – ఈశాన్యం గేటుద్వారా లోపలి స్థలాన్ని సవ్యంగా మూలమట్టానికి చేసి మంచి శాస్త్రగృహాన్ని కట్టుకోండి. ఇప్పుడు ఉన్నట్టే వాడుకుంటూ పోతే మాత్రం.. అందులో ఎవరూ యోగించరు.
మా ఇంటి మూడు వైపులా అన్నదమ్ముల ఇండ్లు ఉన్నాయి. అందరి ఇండ్ల మీదికి వెళ్లడానికి నడకలు పెట్టొచ్చా? మా అందరిదీ ఒకే స్థలం.
– ఎం. సత్తిరెడ్డి, షాద్నగర్
మనం ఒక ప్రదేశంలో ఇంటిని కట్టుకున్నాం అంటేనే.. చుట్టూ సరైన విధంగా ఒక ప్రహరీతో నిర్మితమైందని అర్థం కదా!? అలా అన్నదమ్ములు వాస్తు ప్రకారం పెద్దవాళ్లు పైభాగంలో, చిన్నవాళ్లు కిందిభాగంలో కట్టుకున్నాక.. ఎవరి ప్రాంగణం వారికి వచ్చేస్తుంది. కింద వేరుచేసుకొని పైన కలపడం దోషం. ఇండ్లు వేరుచేసుకున్నాక కింద, మీద ఎక్కడా పక్క ఇండ్లకు వెళ్లే మార్గాలు పెట్టుకోవద్దు. అది మీ అందరి స్థలం అయినా మీమీ పేర్లమీద రిజిస్టర్ చేసుకున్నారు. మీకు నచ్చినట్లు ఇండ్లు కట్టుకున్నారు. అది అలాగే ఉండాలి. ఒకవేళ మీరు ఎవరి కాంపౌండ్ వారు కట్టుకున్నా.. పైన కలుపుకోవద్దు. అలాగే మీ ఇండ్లకు తప్పనిసరిగా కాంపౌండ్లు కట్టుకోవాలి. అన్నదమ్ములు అయినా సరే!
దక్షిణం – పడమరలో మాకు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంది. అక్కడ వాటర్ సంపు కట్టొచ్చా?
– వి. పద్మావతి, మారేడ్పల్లి
నిర్ణయించిన స్థలంలో ఇంటిని కట్టాలనుకున్నప్పుడు.. శాస్త్ర ప్రకారం చుట్టుపక్కల తప్పకుండా ఖాళీ వదిలి కట్టాలి. లేదంటే, ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు కట్చేసి సరిచేయాలి. ముందుగా మీరు ఇంటి చుట్టూ ఉన్న స్థలాన్ని తూర్పు కన్నా పడమర తక్కువ చేసి, అలాగే ఉత్తరం కన్నా దక్షిణం తక్కువ చేసి ప్రహరీలను స్థిరపరచండి. ఇంటి చుట్టూ ఖాళీలు కుదిరాక సంపు విషయం ఫైనల్ చేయండి. దక్షిణం, పడమరలో నీళ్ల కోసం భూమి లోపలికి సంపు అసలు పనికిరాదు. స్థలం ఉంటే.. తూర్పు లేదా ఉత్తరంలో నీళ్ల సంపులు వస్తే చాలా బాగుంటుంది. నీళ్ల సంపు కాకుండా నీళ్ల తొట్టె అవసరం అయితే.. తూర్పు – ఆగ్నేయంలో లేదా దక్షిణంలో అలాగే, పడమరలో, నైరుతిలో కూడా నేలమీద ఎత్తుచేసి కట్టుకోవచ్చు. దక్షిణ – పడమరలో నీళ్లు ఉండవద్దు కదా.. అనుకోవద్దు. నేలమీద ఎత్తు చేసి కట్టుకోవచ్చు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏమిటి? కార్పెట్ ఏరియా అంటే ఏమిటి? అవన్నీ చూడాలా?