Vasthu Shastra | గతజన్మల ఫలం లేకుండా ఈ జన్మలో ఇల్లు కట్టలేమా? అసలు మనిషికి మళ్లీ మళ్లీ జన్మలు ఉంటాయా?
– జి.వి. సీతామహాలక్ష్మి
భారతీయ శాస్ర్తాలు, ఇతిహాసాలు, పురాణాలు.. అన్నీ మనం సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడే మానవ జన్మకు సంబంధించిన ఆవశ్యకత అర్థం అవుతుంది. ప్రతి వ్యక్తీ ప్రతిభావంతుడే.. అనేది ఆధునిక విజ్ఞానం నిర్ధారిస్తుంది. వ్యక్తి ప్రతిభకు ప్రకృతి సహకారం అవసరం అనేది శాస్త్రవచనం. డ్రైవర్.. కారు సజావుగా ఉన్నంత మాత్రాన సమయానికి గమ్యం చేరుకుంటామని చెప్పలేం! ఎప్పుడు – ఏదైనా జరగవచ్చు. సంకల్పం – బలం ఉంటే.. అది త్రికరణశుద్ధిగా ఉంటే.. మన అర్హతను బట్టి తప్పక ఫలితం లభిస్తుంది.ఇల్లు కట్టుకోవచ్చు. నీ బలోపేత నిర్ణయమే నీ శక్తి, నీ గత జన్మఫలంగా నిలుస్తుంది. మనిషికి గత జన్మ ఫలాలు ఉంటాయి. అవి ప్రస్తుతంలోని మన మానసిక ధర్మయుక్త స్వభావాలను బట్టి మారుతాయి. అందుకే, కొందరు సాధారణంగా కనిపిస్తూ, నిజాయతీగా ఉంటూ.. అసాధారణ విజయాలు సాధిస్తారు. వర్తమానం – గతం ఏదైనా మన స్వభావరీతులను బట్టి పనుల వైభవం ఉంటుంది. జన్మలు మనిషికి ఉంటాయి అన్నది.. వేదం బలంగా చెప్పిన అంశం. దాన్ని అంగీకరించక తప్పదు. మనిషి కృషికి దైవం తోడ్పాటు అవసరం ఉంటుంది. ఉండాలి కూడా.
మేం ఇంటికి దక్షిణం – ఉత్తరం వరండా వేశాం. దాని ఫ్లోరింగ్ ఎలా వేయాలి? అసలు, వరండాలు వేయవచ్చా?
– డి. కృష్ణ, నల్లగొండ
ఇంటికి వరండాలు వేయాలంటే.. ముందుగా చూడాల్సింది స్థలాన్ని. ఇంటి చుట్టూ ఆవరణం విశాలంగా ఉంటే నిక్షేపంగా వేయవచ్చు. వరండా కూడా ఇంట్లో భాగమే అవుతుంది. ఒకవిధంగా ఇంటి ముందర అందరూ వచ్చి కూర్చునే హాలుగా.. ఓపెన్‌గా ఉంటుంది. ఆ వరండాలు వేసిన తరువాత కూడా తూర్పులో ఖాళీ స్థలం తప్పక ఉండాలి. అప్పుడే ఆ ఇంటికి, ఇంటి సభ్యులకు శోభగా ఉంటుంది. ఉత్తరం – దక్షిణం వరండాలు మంచిదే! వాటికి తగిన విధంగా వాలుతో కూడుకున్న కప్పు వేయాలి. రెండు వరండాలు ఒకే విధమైన కొలతలతో ఎలివేషన్‌తో ఉండాలి. ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ చూసుకొని దానికన్నా ఒక మెట్టు దిగేలా.. అంటే, ఆరు అంగుళాలు ఉండేలా పల్లంగా వేయాలి. ఉత్తరం – దక్షిణం వరండాల ఫ్లోరింగ్‌లో దక్షిణం వరండా ఫ్లోరింగ్, ఉత్తరం కన్నా ఎత్తుగా ఉంటూనే.. ఇంటి ఫ్లోరింగ్ కన్నా తక్కువ ఉండాలి. ఇంటి గర్భం ఎత్తుకు దానికి ఆనుకొని ఉన్న నిర్మాణాలు.. అవి వరండాలు అయినప్పుడు వాటి ఫ్లోరింగ్ ఎత్తుగా ఉండకూడదు.
పక్క ఇంటివాళ్ల బావి మాకు నైరుతి అవుతుంది. అది మాకు నష్టం అంటున్నారు. ఏం చేయాలి?
– బి. వేణు, ఆలేరు
మానవులంతా సమష్టిగా జీవించడం అనివార్యం.. ఈ నేల మీద. ఒకరికి అనుకూలంగా ఉండేది.. మరొకరికి ప్రతికూలం అవడం సాధారణం. కాబట్టి శాస్త్ర విషయాలు అవగాహన చేసుకొని గృహాలు నిర్మించుకోవాలి. ఎవరి ఇంటిని వారు సరైన కొలతలతో, ఇంటి చుట్టూ ఖాళీ వదిలి, ఎవరి ప్రహరీని వారు పటిష్టంగా, నియమబద్ధంగా నిర్మించుకుంటే.. ఒకరి దోషం ఇంకొకరికి చేరదు. ఒకసారి మీ ఇంటి నక్షను పరిశీలించండి. పక్కవారి బావి మనకు నైరుతి అయినా, మన బావి ఎదుటి ఇంటికి దక్షిణం అయినా, మనం నివసించే ఇంటికి ప్రహరీ ఉంటే.. సకల దోషాలు ఇతరులకు అంటవు. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కలిసి బతుకుతూనే ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే.. అది పరస్పరం ఉపయోగంగా ఉంటుంది. మీకు ప్రహరీ లేకుంటే కట్టుకోండి. దోషం ఉండదు.
మాది దక్షిణం ఇల్లు. పెద్దద్వారం క్షిణంలో పెట్టొచ్చా? కిచెన్ ఎలా కట్టాలి? ఇంట్లో కాకుండా బయట ఏర్పాటు చేసుకోవచ్చా?
– పి. సింధు, ధర్మపురి
ఏ ముఖద్వారమైనా.. కిచెన్ ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు. దక్షిణం సింహద్వార గృహంలో వచ్చే ప్రధానమైన అంశాలు రెండు. ఒకటి డ్రాయింగ్ రూమ్, ఇంకోటి వంటగది. వీటిని చక్కగా కుదర్చాలి. దక్షిణం ఇంటికి దక్షిణం ముఖంతో స్థలం ఎక్కువగా ఉంటే.. అంటే, తూర్పు-పడమర పొడవు కలిగిన స్థలమైతే, ఆగ్నేయంలో యథావిధిగా కిచెన్ తీసుకొని, దక్షిణ ఉచ్ఛమైన భాగంలో డ్రాయింగ్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. స్థలం చతురస్రం అయితే, కిచెన్ గదిని వాయవ్యంలోకి మార్చాలి. అప్పుడు దక్షిణ-ఆగ్నేయంలో డ్రాయింగ్ గది వస్తుంది. చాలా మంచిది. దక్షిణం ముఖం అయినా.. తూర్పు- పడమర ముఖ గృహాలు అయినా ఇంట్లో ద్వారాలు తూర్పు-ఉత్తరం సమాన కొలతలతో ఉండాలి. మిగతా గదుల ద్వారాలు వెడల్పులో మారినా.. ఎత్తులో అన్నీ సమానంగానే ఉండాలి. కిచెన్ ఇంటిలో కాకుండా పూర్తిగా బయట పెట్టాలి అంటే.. తూర్పు-ఆగ్నేయం లేదా ఉత్తర-వాయవ్యంలో ఇంటికి అంటకుండా వేసుకోవాలి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?