Vasthu Shastra | మట్టి గోడలతో ఇల్లు కట్టొచ్చా? ఎంత వైశాల్యంలో కట్టాలి? ఎన్ని గదులు వేయవచ్చు? కప్పు ఎలా ఉండాలి?
– సుభిక్ష, మోత్కూర్
ఇప్పటికీ పల్లెటూళ్లలో మట్టితో కట్టిన ఇండ్లు అనేకం కనిపిస్తాయి. అవన్నీ ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇలాంటి ఇండ్లను ఎంత వైశాల్యంలోనైనా కట్టుకోవచ్చు. ఎన్ని గదులు అయినా వేసుకోవచ్చు. నియమం అంటూ ఏమీలేదు. కానీ, గోడ మందం రెండు అడుగులు ఉండాలి. గదుల కింద తప్పకుండా పునాది ఉండాలి. భూమిలోకి మూడు అడుగులు తీసి రాళ్లతో బేస్మెంట్ కట్టాలి. పైన కప్పు పెంకులతో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. బరువు తక్కువ, సహజసిద్ధంగా, ఆహ్లాదంగా ఉంటుంది. నాలుగు వైపులా వాలుగా ఉండే పిరమిడ్ ఆకారంలో ఇంటి పైకప్పు వేసుకోవచ్చు. వాస్తు తప్పక పాటించాలి.
ఇంటికి దక్షిణం వైపు ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లకుండా గేటు పెట్టుకోవచ్చా? దక్షిణం ఇంట్లో కలుపుకోవచ్చా?
– ఎస్. రామమూర్తి, కొంపెల్లి
ఇంటి చుట్టూ ఖాళీ పెట్టడంలో ఉద్దేశం.. ఇంటికి ధారాళంగా గాలి, వెలుతురు రావాలనే! దాంతోపాటు మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంటి చుట్టూ ఉన్న శుద్ధి, ఔషధ మొక్కలు.. వాటి గాలి, ఇవన్నీ కలుపుకొని ఇంటిలోనికి ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి దానికి హద్దులు ఉంచవద్దు. మూతలు ఉండవద్దు. మీరు దక్షిణం ఖాళీకి వెళ్లకుండా గేటు పెడితే, అది ఇంటికి ఆగ్నేయం మూత అవుతుంది. అప్పుడు ప్రదక్షిణం పోతుంది. తద్వారా దోషమే కనుక.. అటువైపు గేటు మంచిది కాదు. అట్లాగే దక్షిణం ఖాళీని ఇంటిలోకి కలపడం చాలా పెద్ద దోషం. దాంతో దక్షిణ హద్దు గృహం అయ్యి, ఇంట్లో అనారోగ్యాలు దాడిచేస్తాయి. ముఖ్యంగా మహిళలు రోగ పీడితులు అవుతారు.
మాకు పడమర మెయిన్ రోడ్డు ఉంది. కానీ, తూర్పు దిక్కు స్థలం ఎత్తు ఉంటుంది. అటు దిక్కు కూడా రోడ్డు ఉంది. ఇల్లు ఎలా కట్టాలి?
– వి. సముద్ర, కట్టంగూర్
భయపడాల్సిన అవసరం లేదు. మీరు తూర్పు ముఖంగా ఇల్లు కట్టుకోవచ్చు. పడమర వీధి ఎత్తుకు సరిపడేలా నేల మీద ఇల్లు కట్టొచ్చు. దానిని పడమర ముఖంగానే వాడుకోవచ్చు. పడమర వైపు పార్కింగ్‌కు గానీ, దుకాణాలకు గానీ వినియోగించవచ్చు. తూర్పు రోడ్డు ఉంది కాబట్టి తూర్పు వైపు నుంచి సింహద్వారం పెట్టుకొని, తూర్పు దిశగా ప్రధాన గృహం.. మీరు ఉండే ఇల్లు కట్టుకోండి. దానినే వినియోగించండి. తూర్పు నుంచి పడమరవైపు దిగేలా మెట్లుకానీ, ర్యాంపు కానీ పెట్టవద్దు. దేనికదిగా వాడుకోవచ్చు. ఇంటిలోకి రావడానికి పడమర-నైరుతిలో మెట్లు వేసుకోవచ్చు. దక్షిణంలో లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు.
మాది రైస్ మిల్లు. ఆఫీస్ నైరుతిలో వేయలేము. ఎక్కడ కట్టాలి?
– బి. సిద్ధేశ్వర్, గజ్వేల్
పెద్దపెద్ద షెడ్లతో వేసే వ్యాపార నిర్మాణాలను వెనుక కట్టుకొని, తూర్పు భాగంలో లేదా ఉత్తర భాగంలో ఆఫీస్ పెట్టడం మంచి అమరిక అవుతుంది. అదే సరైన విధానం. పడమర గోడను లేదా షెడ్డు గోడను ఆనుకొని తూర్పు ముఖంగా షెడ్డు వెడల్పుతో తక్కువ ఎత్తు.. అంటే 10 లేదా 12 అడుగుల ఎత్తుతో ఆఫీస్ గది నిర్మించుకోండి. అందులోని దక్షిణం గదిలో యజమాని కూర్చొని వ్యాపారం చేసుకోవచ్చు. ఆ ఆఫీస్‌కు తూర్పు లేదా తూర్పు – ఈశాన్యంలో ద్వారం పెట్టుకోవచ్చు. స్టాఫ్ ఉండవచ్చు. అలాగే ఉత్తరంలో కూడా దక్షిణం రైస్ మిల్ గోడకు ఆనుకొని ఉత్తరం దిశగా ఆఫీస్ కట్టి, పడమర గదిలో కూర్చొని వ్యవహారం చేసుకోవచ్చు. శుభ ఫలితాలు ఉంటాయి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?