Yashasvi Jaiswal : సుదీర్ఘ ఫార్మాట్లో పరుగుల ప్రవాహం కొనసాగిస్తూ.. రికార్డులు బద్ధలు కొడుతున్నాడు భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal ). నిరుడు వెస్టిండీస్ పర్యటనతో టీమిండియా స్టార్‌గా అవతరించిన యశస్వీ ఇంగ్లండ్ గడ్డ మీద కూడా చెలరేగుతున్నాడు. తన విధ్వంసక ఆటతో ఈతరం కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ చిచ్చరపిడుగు ఇంగ్లండ్ గడ్డ మీద వీరాభిమానిని కలిశాడు. అతడి పేరు రవి (Ravi). దృష్టిలోపంతో బాధపడుతున్న ఆ చిన్నారి ఎడ్జ్‌బాస్టన్‌కు వచ్చాడని తెలిసి.. స్వయంగా వెళ్లి పలకరించాడీ ఓపెనర్. అంతేకాదు అతడికి ప్రత్యేక బహుమతి అందించాడు.
‘హలో రవి. ఎలా ఉన్నావు? నా పేరు యశస్వీ. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు క్రికెట్‌ను ఎంతో ఇష్టపడతావని తెలిసి నేను చాలా థ్రిల్ అయ్యాను. నేను నీకో బహుమతి తీసుకొచ్చాను. ఇది నా బ్యాట్. దీన్ని నా జ్ఞాపకంగా నీ వద్ద ఉంచుకోవాలని కోరుతున్నా. నీన్ను కలవడం.. నీతో మాట్లాడడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. నిన్ను ఇక్కడ చూసినందుకు సో హ్యాపీ’ అని యశస్వీ అన్నాడు. తన అభిమాన ఆటగాడు తనతో మాట్లాడడంతో ఉబ్బితబ్బిబ్బైన రవి సంతోషం పట్టలేకపోయాడు.
Meet 12-year old Ravi – He is blind but an avid cricket follower 🫡
He had one wish – to meet Yashasvi Jaiswal and his wish came true this morning at Edgbaston 🫶🏼🥹#TeamIndia | #ENGvIND | @ybj_19 pic.twitter.com/ykvZU5aQ0m
— BCCI (@BCCI) July 5, 2025
‘నిన్ను కలిసినందుకు నేను కూడా హ్యాపీ. నువ్వు భారత స్టార్‌వి. నాకు క్రికెట్ అంటే ఇష్టం. నీ బ్యాటింగ్ చూస్తా. నువ్వు సెంచరీ కొట్టిన ప్రతిసారి నేను ఎంతో ఎంజాయ్ చేశాను’ అని యశస్వీతో రవి అన్నాడు. చూపు సరిగ్గా లేకున్నా సరే క్రికెట్‌పై అతడికున్న మక్కువ, ఆటపై అతడికున్న పరిజ్ఞానం చూసి జైస్వాల్ ఫిదా అయ్యాడు. యశస్వీ – రవితో సంభాషిస్తున్న వీడియోను బీసీసీఐ షేర్ చేయగా నెట్టింట వైరలవుతోంది.