World Athletics Championships : ఒలింపిక్స్ హక్కుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత్ మరో మెగా టోర్నీ నిర్వహణ దిశగా పావులు కదుపుతోంది. 2036 విశ్వక్రీడల హక్కుల కోసం ప్రయత్నిస్తూనే.. మరోవైపు ప్రతిష్టాత్మక వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ (World Athletics Championships) ఆతిథ్యానికి ఇండియా సిద్దమవుతోంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా క్రీడా పండుగకు హోస్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో 2029, 2031 ఎడిషన్లకు బిడ్డింగ్ వేయనుంది భారత్. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో లో ఆతిథ్యమిచ్చే దేశాల పేర్లను ప్రపంచ అథ్లెటిక్ సమాఖ్య ఖరారు చేయనుంది.
ఈ నేపథ్యంలోనే భారత బృందం రెండింటో ఒక్కటోర్నీ రైట్స్ అయినా సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని ఆదివారం జాతీయ అథ్లెటిక్ సమాఖ్య అధికార ప్రతినిధి అడిల్లె సుమరివిల్లా (Adille Sumariwalla) ధ్రువీకరించాడు.
వరల్డ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అడిల్లె బెంగళూరులో జూన్ 5 న జరిగిన నీరజ్ చోప్రా క్లాసిక్ తొలి సీజన్ ప్రారంభోత్సవానికి విచ్చేశాడు. ఈ సందర్బంగా ఆయన భారత్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై స్పందించాడు. ‘వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే.. 2029, 2031 ఎడిషన్లకు బిడ్డింగ్ వేయాలనుకుంటున్నాం.
అడిల్లె సుమరివిల్లా
అయితే.. తదుపరి హోస్ట్ ఎంపిక ప్రక్రియ మొదలవ్వడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి మేము పక్కాగా హోస్టింగ్ రైట్స్ కోసం ప్రయత్నిస్తాం. హక్కులు దక్కించుకున్న దేశాల పేర్లను 2026 సెప్టెంబర్‌లో డబ్ల్యూఎఎఫ్ వెల్లడిస్తుంది. సో.. మాకు ఈ రెండిటిలో ఏదో ఒక టోర్నీ ఆతిథ్యానికి ఆమోదం లభించినా సంతోషమే. మరో విషయం.. మేము ఇప్పటికే జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2028 రైట్స్ కోసం అవసరమైన అన్ని పత్రాలు సమర్పించాం’ అని అడిల్లె వివరించాడు.
తన పేరుతో నిర్వహించిన ‘ఎన్సీ క్లాసిక్’ టోర్నీలో నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఛాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో అతడు ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరాడు. కెన్యా అథ్లెట్ జులియస్ యెగొ 84.51 మీటర్లతో రెండో స్థానంలో నిలవగా, రుమెశ్ పథిరగె (శ్రీలంక) 84.34 మీటర్ల దూరంతో మూడో స్థానం దక్కించుకున్నాడు.