Batter Dies on Pitch : అప్పటిదాకా హుషారుగా క్రికెట్ ఆడిన అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సిక్సర్ బాదిన తర్వాత గుండెపోటు (Heatattack) కారణంగా పిచ్ మీదనే పడిపోయాడు. అప్పటిదాకా సరదాగా క్రికెట్ ఆడిన అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాదకరమైన సంఘటన పంజాబ్లో జరిగింది. ఫిరోజ్పూర్లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న హర్జీత్ సింగ్ (Harjeeth Singh) అనే యువకుడు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. దాంతో, పిచ్ వద్దకు పరుగెత్తుకొచ్చిన స్నేహితులు హర్జీత్ను తలచుకొని కన్నీరుపెట్టుకున్నారు. హృదయాన్ని కలచివేస్తున్న ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఫిరోజ్ఫూర్లోని డీఏవీ స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన హర్జీత్ సిక్సర్ కొట్టి అందరిలో జోష్ నింపాడు. కానీ,, పిచ్ మధ్యలోకి వచ్చిన హర్జీత్.. మోకాళ్లపై కూర్చొంటూ అలానే కూలబడ్డాడు. వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో, అతడలా కిందపడిపోవడం చూసిన స్నేహితులు పరుగున వచ్చి సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు.
కానీ, గుండెపోటు కారణంగా హర్జీత్ అక్కడే తుదిశ్వాస విడిచాడు. ఇదే నెలలో ఇలాంటి సంఘటన ముంబైలోనూ జరిగింది. క్రికెట్ ఆడుతూనే 42 ఏళ్ల రామ్ గణేశ్ తేవర్ అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. అతడు కూడా సిక్సర్ బాదిన తర్వాత పిచ్ మీద కూలబడ్డాడు. అప్రమత్తమైన సహచరులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రామ్ గణేశ్ మరణించాడని వైద్యులు తెలిపారు.