– ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు
– ఏక కాలంలో ఏడుచోట్ల తనిఖీలు
గరిడేపల్లి, ఫిబ్రవరి 21 : ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో వ్యవసాయ శాఖ నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తిలో ఏడీఏ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ కు చెందిన నివాసాలు, అనుబంధ ప్రాంతాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ నేతృత్వంలో బృందాలు విడిపోయి మొత్తం ఏడుచోట్ల సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కిరణ్ కుమార్ స్వగ్రామమైన పొనుగోడులో తెల్లవారుజాము నుండే తనిఖీలు ప్రారంభమయ్యాయి. నేరేడుచర్ల పట్టణ కేంద్రంతో పాటు ఆయనకు భాగస్వామ్యం ఉన్న చిల్లేపల్లి గ్రామ శివారులోని అవని రైస్ మిల్లులోనూ అధికారులు తనిఖీలు కొనసాగించారు. అలాగే కల్వకుర్తిలోని కార్యాలయం, గడ్డిపల్లి గ్రామంలోని అత్తగారింటి వద్ద, అనంతగిరి మండలం అమీనాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని కిరాయి ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.
గతంలో సూర్యాపేట డీఆర్డీఏ పీడీగా పనిచేసిన కాలంలో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులపై సుమోటోగా కేసు నమోదు చేసి ప్రాథమిక సమాచారంతో సోదాలు చేపట్టి ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. పూర్తి వివరాలు పరిశీలన అనంతరం వెల్లడిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. తనిఖీలు జరుగుతున్న సమయంలో కిరణ్ కుమార్ పొనుగోడులోనే ఉన్నారు. దర్యాప్తులో భాగంగా ఆయనను ఏసీబీ అధికారులు వెంట తీసుకువెళ్లినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.