Sumanth | అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుమంత్ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కమర్షియల్ చిత్రాల కంటే కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ‘సత్యం’, ‘గోదావరి’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘మళ్లీ రావా’, ‘సీతారామం’, ‘అనగనగా’ వంటి సినిమాలతో నటుడిగా తన ప్రతిభను చాటుకున్న సుమంత్, ఇప్పుడు ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, మాజీ భార్య కీర్తి రెడ్డితో విడాకులు, అలాగే రెండో పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా విడాకుల తర్వాత చాలా మంది దంపతులు ఒకరితో ఒకరు దూరంగా ఉండటం చూస్తుంటాం. కానీ తన విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నమని సుమంత్ తెలిపారు. కీర్తి రెడ్డితో చట్టపరంగా విడిపోయినప్పటికీ, తమ మధ్య ఎలాంటి ద్వేషం లేదని ఆయన చెప్పారు. ఇప్పటికీ ఇద్దరం మంచి స్నేహితులుగానే ఉంటామని, ఆమె కుటుంబ సభ్యులతో కూడా తనకు మంచి అనుబంధం కొనసాగుతోందని వెల్లడించారు. తరచూ మాట్లాడుకుంటూ పరస్పర గౌరవాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. విడాకుల తర్వాత కూడా మంచి సంబంధాలు ఎలా కొనసాగిస్తున్నారనే ప్రశ్నకు సుమంత్ ఎంతో పరిణతితో సమాధానం ఇచ్చారు.మేం ఇద్దరం మంచి మనుషులం. జీవితంలో జరిగిన విషయాలను అంగీకరించాం. ఒకరినొకరు క్షమించుకున్నాం. గతాన్ని పట్టుకుని ఉండకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇప్పటికీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని ఆయన తెలిపారు.
జీవితంలో కొన్ని నిర్ణయాలు అప్పటి పరిస్థితుల వల్ల తీసుకోవాల్సి వస్తాయని, వాటిని జీవితాంతం మోస్తూ ఉండాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.తమ వైవాహిక జీవితం గురించి మాట్లాడిన సుమంత్, పెళ్లి జరిగిన సమయంలో తమిద్దరికీ జీవితంపై సరైన అవగాహన, పరిణతి లేదని అన్నారు.మా పెళ్లి సమయంలో ఇద్దరికీ తగినంత మెచ్యూరిటీ లేదు. అదే మేము విడిపోవడానికి ప్రధాన కారణం. ఎలాంటి గొడవలు లేదా ఇతర కారణాలు కాదు. జీవితాన్ని అర్థం చేసుకునే విధానం అప్పటికి పూర్తిగా రూపుదాల్చలేదు. అందుకే మా ప్రయాణం అక్కడితో ముగిసింది. ఒకరకంగా చూస్తే మా జీవితం కూడా సినిమా కథలా సాగింది అని ఆయన చెప్పారు. రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకు కూడా సుమంత్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తాను ఒంటరి జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నానని, మరోసారి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని వెల్లడించారు.