MLA Vijaya Ramana Rao | ఓదెల, జూన్ 29 : పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో 235 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, 27 మంది లబ్ధిదారులకు ₹27,03,132ల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 52 మంది లబ్ధిదారులకు ₹19,70,500ల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు జిలకుంట గ్రామంలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ₹10 లక్షలతో శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డులను అందజేసినట్లు తెలిపారు. రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేసే బియ్యంపై పేద కుటుంబాలు ఆధారపడి ఉన్నారన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని గుర్తు చేశారు. ఓదెల మండల కేంద్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రైతులు పండించిన ధాన్యం ఆకాల వర్షాలతో తడిసినప్పటికీ ఒక గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేసి 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేశామని, సన్నాలకు ₹500 బోనస్ ఇచ్చామన్నారు.
అలాగే తొమ్మిది రోజుల్లోనే రైతన్నల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయాన్ని అందించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న ఖాతాల్లో రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమ చేసిందని అన్నారు. అలాగే రైతన్నలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ వేస్తున్నామని, సన్న వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తుందని, గతం కంటే ఎక్కువగా పెట్టుబడి సహాయం రైతు భరోసా కింద రూ. 12000 ఎకరానికి అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం,ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకు గ్యాస్ సిలిండర్, సన్నరకం బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ వథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాకురూ. 38 కోట్లు సన్న వడ్లకు బోనస్ ఇస్తే, కేవలం పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు రూ.31 కోట్లు బోనస్ చెల్లించామని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ వెన్నుదండుగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి, నాయకులు ఆకుల మహేందర్, బోడకుంట చిన్నస్వామి, బోడకుంట శంకర్, బైరి రవి గౌడ్, చీకట్ల మొండయ్య, రెడ్డి రజనీకాంత్, చింతి రెడ్డి విజయేందర్ రెడ్డి, గుండేటి ఐలయ్య యాదవ్, పిట్టల రవికుమార్, కొల్లూరి చందు, ఢిల్లీ శంకర్, మల్లయ్య లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.