Puri Stampede | పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిలాట ఘటన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అధికారులపై సీఎం మోహన్ చరణ్ మాఝీ కఠిన చర్యలు తీసుకున్నారు. పూరీ జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీని బదిలీ చేశారు. ఈ మేరకు సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, ఎస్పీ వినీత్ అగర్వాల్‌లపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు డీసీపీ విష్ణు పాటి, కమాండెంట్ అజయ్ పాధిలను సస్పెండ్ చేశారు. పూరి జిల్లా కొత్త కలెక్టర్‌గా చంచల్ రాణాను, కొత్త ఎస్పీగా పినాక్ మిశ్రాను ప్రభుత్వం నియమించింది. డెవలప్మెంట్ కమిషనర్ పర్యవేక్షణలో ఘటనపై విచారణకు సీఎం మాఝీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. మరణించిన ప్రతి భక్తుడి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు.
డెవలప్మెంట్ కమిషనర్ పర్యవేక్షణలో వివరణాత్మక పరిపాలనా విచారణకు సీఎం ఆదేశించారు. దాంతో పాటు ఈ సంఘటనకు ముఖ్యమంత్రి భక్తులందరికీ క్షమాపణలు చెప్పారు. జగన్నాథ భక్తులందరికీ ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబున్నానన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం నుంచి కోలుకునే శక్తిని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఇదిలా ఉండగా.. పూరీలోని గుండిచా ఆలయ సమీపంలో ఆదివారం ఉదయం తొక్కిసలాట జరగడంతో ముగ్గురు భక్తులు మరణించగా.. మరో 50 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మృతులను బోలాఘర్ నివాసి బసంతి సాహు, బలిపట్న నివాసితులు ప్రేమకాంత్ మొహంతి, ప్రవతి దాస్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.