ప్రస్తుతం మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఆహార పదార్థాలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో కుటుంబాలు నానా తిప్పలు పడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ హైలాండ్స్‌లోని ఒక కుటుంబంలో అంతకన్నా ఘోరం జరిగింది. లీటరు పెట్రోలు దొరక్కపోవడంతో రెండ్రోజుల వయసున్న పాప మరణించింది.
ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న దియతలవ హాస్పిటల్లో జ్యుడీషియల్ మెడికల్ ఆఫీసర్ (జేఎంవో)గా ఉన్న షానక రోషన్ పతిరాణా వెల్లడించారు. హల్దాముల్లాకు చెందిన కుటుంబంలో రెండ్రోజుల వయసున్న పాపకు అనారోగ్యం చేసిందని, జాండీస్‌తో బాధ పడుతున్న ఆ పాపను సమయానికి ఆస్పత్రికి తీసుకురాలేదని ఆయన తెలిపారు. పాపను ఆస్పత్రికి తీసుకురావడానికి తన బండిలో పెట్రోల్ లేకపోవడంతో ఆ తండ్రి కంగారు పడిపోయాడని, ఎక్కడో ఒక చోట పెట్రోల్ తీసుకొచ్చేసరికి ఆలస్యమైందని డాక్టర్ చెప్పారు.
పెట్రోలు దొరికిన తర్వాత పాపను ఆస్పత్రికి తెచ్చారని, అయితే అప్పటికే ఆలస్యం అవడంతో పాప కన్నుమూసిందని తెలియజేశారు. ఈ హృదయ విదారక ఘటన గురించి సోషల్ మీడియాలో వెల్లడించిన పతిరాణా.. ‘‘రెండ్రోజుల పసికందుకు పోస్టుమార్టం చేయాల్సి రావడం అత్యంత బాధాకరం. లీటరు పెట్రోల్ దొరక్క తమ కతురు చనిపోయిందనే భయంకరమైన నిజం ఆ తల్లిదండ్రులను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.