Bathukamma Song | హైదరాబాద్ : మూసీ బాధితులు వినూత్నంగా బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. తొలిరోజైనా ఎంగిలి పూల బతుకమ్మ రోజునా.. ఆడబిడ్డలు బరువైన హృదయంతో బతుకమ్మలను పేర్చి ఆడారు. బతుకమ్మ మా ఇంట వెలుగులు ప్రసాదించు తల్లి అని వేడుకుంటూ పాడాల్సిన మహిళల నోటి నుంచి.. కన్నీళ్లు రాల్చుతూ తమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. సంబురంగా జరుపుకోవాల్సిన బతుకమ్మ వేడుకలను.. చీకటి బతుకుల మధ్య జరుపుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీ బాధితులు తమ నివాసాల ముందు బతుకమ్మలను పేర్చి.. రేవంత్ రెడ్డి మీద పాటలు పాడారు. రేవంత్ సారు ఉయ్యాలో.. మా ఇళ్ల జోలికి రాకు ఉయ్యాలో అంటూ ఎల్బీనగర్ చైతన్యపురిలో మహిళలు బతుకమ్మ ఆడారు. వారు పాడుతున్నంత సేపు వారి గొంతులో ఒక బాధ కనిపించింది. హుషారుగా పాడాల్సిన ఆ గొంతుల్లో ఏదో మూగబోయిన స్వరం వినిపించింది.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
రేవంత్ సారు ఉయ్యాలో.. నీ జాగల నువ్వుండు ఉయ్యాలో..
మా ఇంట్ల మమ్మల్ని ఉయ్యాలో.. ఉండనీయవయ్యా ఉయ్యాలో..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
మూసీ ప్రక్షాళన ఉయ్యాలో.. ఉన్నదాంట్ల చేయ్ ఉయ్యాలో..
మా ఇండ్ల జోలికి ఉయ్యాలో.. నువ్వు రావొద్దయ్య ఉయ్యాలో..
ఇకనైన నువ్వు ఉయ్యాలో.. బుద్ధి తెచ్చుకో ఉయ్యాలో..
నీ పదవి నీకు ఉయ్యాలో.. ఉండదయ్య నీకు ఉయ్యాలో..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
ఆడోళ్ల జోలికి ఉయ్యాలో.. నువ్వు రావొద్దయ్య ఉయ్యాలో..
ఆది పరాశక్తులం ఉయ్యాలో.. అంతమై పోతవయ్య ఉయ్యాలో..
లండన్లో థేమ్స్ నది ఉయ్యాలో.. చూసి వచ్చినవా ఉయ్యాలో..
హైదరాబాద్లో ఉయ్యాలో.. అది జరగదయ్య ఉయ్యాలో..
లండన్లో పుట్టలేదు నీవు ఉయ్యాలో.. లండన్లో పెరగలేదు ఉయ్యాలో..
రేవంత్ రెడ్డి మీద బతుకమ్మ పాట పాడిన మూసీ బాధితులు
ఎల్బీనగర్ – చైతన్యపురిలో ‘రేవంత్ సారూ ఉయ్యాలో.. మా ఇళ్ల జోలికి రాకు ఉయ్యాలో’ అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడిన మూసీ బాధితులు. pic.twitter.com/FrfCxPedQJ
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024
ఇవి కూడా చదవండి..
KTR | మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది.. ఇంకా శుద్ధి ఎందుకు: కేటీఆర్
TG High court | పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్టే ఇచ్చేందుకు నిరాకరణ