KTR | ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆనాడు రైతు బంధు కింద రూ.10 వేలు ఇస్తే బిచ్చం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నదేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కష్టమొస్తే.. వెంటనే వస్తానని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. రాహుల్ గాంధీ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. రైతులు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మోసం చేస్తుంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారంటూ మండిపడ్డారు.
తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలపై నిలదీస్తే దివాళా కోరు మాటలు చెబుతున్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అప్పులపాలైందని అధికారంలోకి రాగానే ప్రచారం చేస్తున్నారు. వందరోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేశారు. మంత్రులు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అవాస్తవాలు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు.. కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగాలేదని కేటీఆర్ఎద్దేవా చేశారు.
420 హామీల పరిస్థితి ఏంటీ..?
హామీలు అమలు చేయమంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల పరిస్థితి ఏంటీ..? ఎవరిని మోసం చేయడానికి ఇన్ని హామీలిచ్చారో చెప్పాలని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెడగొట్టింది రేవంత్రెడ్డి ప్రభుత్వమేనని.. విధ్వంసకరమైన ఆలోచనలతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందన్నారు. కాంగ్రెస్ ఏడాదిలో రూ.లక్షా 38 వేల కోట్ల అప్పులు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేస్తే అభివృద్ధి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పులతో ఏం అభివృద్ధి చేసిందని.. . అప్పులు తెచ్చిన డబ్బులు మూటలుగా పోతున్నాయా..? అని ప్రశ్నించారు.
కొత్త పెట్టుబడులు రావడం లేదు.. ఉన్న కంపెనీలు పోతున్నాయి. వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తుంటే ఇలా అబద్దాలు చెప్పవచ్చా అని ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఉద్యోగుల పీఆర్సీ, డీఏ ఎగ్గొట్టేందుకు అబద్దపు లెక్కలు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా..? అని మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్దమా అని చాలెంజ్ చేసిన కేటీఆర్.. హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆగదని మరోసారి స్పష్టం చేశారు.
చేతకాని మాటలు చెప్తారా..?
అధికార పీఠం మీద కూర్చొని చేతకాని మాటలు చెప్తారా..? కేసులు పెట్టడం, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం.. ఇదేనా మార్పు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. కడుపు కట్టుకుంటే రూ.40 వేల కోట్లు వస్తాయని రేవంత్ అన్నారు. మరి ఏమైంది.? రుణమాఫీ అందరికీ ఎందుకు చేయలేదన్నారు. ప్రభుత్వ ఖర్చులన్నీ పోను నెలకు రూ.1,734 కోట్ల మిగులు ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే.. రూ.4వేల కోట్ల లోటు ఉందని అబద్దాలు చెబుతున్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, కుట్ర అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Peddi sudarshan reddy | రైతులు తిరగబడేందుకు సిద్దమయ్యారు : పెద్ది సుదర్శన్ రెడ్డి
KTR | మోసానికి మారు పేరు.. ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్: కేటీఆర్