ఇంకో ముసుగు తొలగిపోయింది. గ్యారెంటీలన్నీ గాల్లో మూటలేనని మరోసారి తేలిపోయింది. తానిచ్చిన హామీకి తానే తూట్లు పొడువడం తన నైజమని కాంగ్రెస్ మరోమారు చాటుకున్నది. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి కేసీఆర్ ఇస్తున్నట్టు రూ.5000 కాకుండా రూ. 7500 ఇస్తానని ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ ఊదరగొట్టింది. ఏడాదికి 15 వేలు ఇస్తానని మ్యానిఫెస్టోలో చేర్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లోనూ అదే విషయం ప్రకటించింది. ఏడాది గడిచింది. కాంగ్రెస్ హామీల అసలు రంగు బయటపడింది.
ఒక్కొక్క గ్యారెంటీని అటకెక్కిస్తున్న రేవంత్ సర్కార్.. రైతు హామీలకూ మంగళం పాడుతూ వచ్చింది. కొర్రీలు, కోతలు పెట్టి రుణమాఫీని మూడోవంతుకు పరిమితం చేసింది. బోనస్‌ను బోగస్ చేసింది. వానకాలం సీజన్‌కు రైతుభరోసాను ఎగవేసింది. మంత్రివర్గం, సబ్‌కమిటీ, అభిప్రాయ సేకరణ అంటూ డ్రామాలాడి చివరికి ఎకరానికి 15000 ఇవ్వడం తనవల్ల కాదని ఇప్పుడు తేల్చేసింది. 12వేలతోనే సరిపెట్టుకోమని చెప్తున్నది. అది కూడా సాగుయోగ్యమైన భూమికే ఇస్తామని కోతల కొరడా ఝలిపిస్తున్నది. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరిట రైతు కూలీలకు 12 వేలు ఇస్తామంటూ కొత్త గారడీకి తెరతీసింది.
రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెప్పినం. చెప్పిన ప్రకారం ఇచ్చి తీరుతం.
-2023 సెప్టెంబర్ 13న తుక్కుగూడ సభలో రాహుల్
రైతు డిక్లరేషన్ ద్వారా ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమి కలిగిన రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తాం. కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ.15వేలు ఇస్తాం.
– 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్‌లో హామీ.
సోనియమ్మ రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కేసీఆర్ నువ్వు రైతుబంధు పేరిట రైతులకు రూ.10 వేలు బిచ్చమేస్తే, మేం ఆత్మగౌరవం నిలబెట్టడానికి రూ.15 వేలు ఇస్తాం. రైతులు ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తయి. మేము అధికారంలోకి వచ్చినంక తీసుకుంటే రూ.15వేలు వస్తయి.
– వరంగల్ డిక్లరేషన్ సభలో, ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి
భూమి ఉన్న రైతులతోపాటు కౌలురైతులకు కూడా ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు ఇందిరమ్మ రైతుభరోసా అందిస్తాం.
– కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ
Rythu Bharosa | హైదరాబాద్, జనవరి 4(నమస్తే తెలంగాణ): వరంగల్ రైతు డిక్లరేషన్, మ్యానిఫెస్టో సాక్షిగా కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చిన హామీని తుంగలో తొక్కింది. మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ధోకా ఇచ్చింది. రైతు భరోసాలో కోత పెట్టింది. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సీజన్‌కు రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గే ఇప్పుడు మాటతప్పారు.
ఎకరానికి రూ.15 వేలు కాదు.. రూ.12 వేలు మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వ్యవసాయయోగ్యమైన భూములకు ఎకరాకు సీజన్‌కు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట తప్పింది. ఇప్పటికే వానకాలం పంటలకు రైతు భరోసా ఇవ్వకుండా రైతులకు రూ.11వేల కోట్లను ఎగ్గొట్టింది. ఇప్పుడు యా సంగిలో కోతలు, షరతులతో పంపిణీకి సిద్ధమవుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బడి ముబ్బడిగా అలవికాని హామీలిచ్చింది.
ఎన్నికల ప్రచారం కోసం రాష్ర్టానికి వచ్చిన ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే హామీల వర్షం కురిపించారు. సభ ఏదైనా సరే రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామంటూ జోరుగా ప్రచారం చేశారు. వరంగల్‌లో ప్రత్యేకంగా రైతు డిక్లరేషన్ కూడా వెల్లడించారు. రైతులకు రూ.15 వేల పెట్టుబడి సాయం చేస్తామని వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. జోరు వాన కురుస్తుండగా 2022 మే 6న రైతులపై హామీల జల్లు కురిపించారు. ఆ తర్వాత సభల్లో ప్రియాంక, మల్లికార్జున ఖరే కూడా ఇదే హామీ ఇచ్చారు. చివరకు సోనియా, రాహుల్, ఖర్గే మాట తప్పారు. కాంగ్రెస్ సర్కారు వస్తే ఎకరాకు రూ.15 వేలు వస్తదని ఆశపడ్డ రైతులను నిరాశపరుస్తూ రూ.12వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించారు.
‘కేసీఆర్ ఇచ్చే ముష్టి పదివేలు ఎందుకు? మా ప్రభుత్వం రాగానే ఎకరాకు రూ.15వేలు ఇస్తాం’ అంటూ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడేమో రూ.15 వేల హామీని పక్కకునెట్టి, ఆ పదివేలకు మరో రెండు వేలు మాత్రమే కలిపి ఇస్తున్నారు. రైతు భరోసా కింద ఎకరానికి సీజన్‌కు రూ.7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు దీన్ని రూ.ఆరువేలకే పరిమితం చేసింది. ఈ లెక్కన ఇచ్చిన హామీలో ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.1,500 కోత పెట్టింది. గతంలో కేసీఆర్ సర్కారు ప్రతి సీజన్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ ప్రభుత్వం కన్నా రూ.వెయ్యి మాత్రమే ఎక్కువగా ఇస్తుండటం గమనార్హం. వాస్తవానికి, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కేసీఆర్ సర్కారు కన్నా ప్రతి సీజన్లో ప్రతి ఎకరాకు రూ.2,500 అధికంగా ఇవ్వాలి.
కొండంత రాగం తీసి.. కూని రాగం పాడిన చందంగా ఉన్నది కాంగ్రెస్ సర్కారు తీరు. రైతు భరోసాపై ఏదో చేస్తున్నట్టు హంగామా చేసిన ప్రభుత్వం తీరా కోతలకు పెద్దపీట వేసింది. ఈ మాత్రం దానికి మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఏదో చేస్తామని చెప్పడం ఎందుకో అర్థంకాదు. రైతు భరోసా కోసం ఏర్పాటైన మంత్రుల కమిటీ చేసిన హడావుడి మాములుగా లేదు. రైతులను ఉద్దరిస్తామన్నట్టుగా హెలికాప్టర్లలో వెళ్లి మీటింగ్‌లు, అభిప్రాయ సేకరణ పేరుతో పెద్దపెద్ద సభలు, వీడియో కాన్ఫరెన్స్‌లు.. ఇలా కమిటీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా రూ.15వేల సాయాన్ని రూ.12వేలకు కుదించింది. సాగుకు యోగ్యమైన భూములకు ఇస్తామని ప్రకటించింది.
శనివారం ప్రెస్మీట్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. అయితే సాగు యోగ్యమైన భూమి అంటే ఏమిటో అర్థం మాత్రం చెప్పలేదు. ఇంతకుముందు సీఎంతోపాటు మంత్రులంతా సాగు చేసిన భూమికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని బహిరంగంగానే ప్రకటించారు. సాగు యోగ్యమైన భూమికి మాత్రమే ఇస్తామని సీఎం చెప్తుంటే.. మంత్రులేమో సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు.
సాగు యోగ్యమైన భూమి వేరు.. సాగు చేసిన భూమి వేరు. వానకాలంలో రాష్ట్రంలో సాగునీరు పుష్కలంగా ఉండటంతో 136 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. యాసంగి సీజన్లో సాగు నీళ్ల కొరతతో 60 లక్షల ఎకరాలకే పరిమితమవుతుంది. ఇందులో మిగిలిన 76 లక్షల భూమి సాగు యోగ్యమైన భూమి అయినప్పటికీ, నీళ్ల కొరతతో సాగు చేయలేదు. అంటే యాసంగిలో సాగు యోగ్యమైన 136 లక్షల ఎకరాల భూమికి రైతుభరోసా ఇస్తరా? లేక సాగు చేసిన 60 లక్షలకే ఇస్తరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆరు గ్యారెంటీలు, హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు 365 రోజులు దాటినా అమలు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. కోతలే లక్ష్యంగా కొన్ని పథకాలను అరకొరగా అమలు చేస్తున్నది. ఇప్పటికే రుణమాఫీలో ఎడాపెడా కోతలు పెట్టి, కొన్ని లక్షల మందికి ఎగనామం పెట్టిందనే విమర్శలున్నాయి. మొత్తం 42 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, చివరికి 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. ఇంకా 16.65 లక్షల మంది రైతులకు రూ.10,384 కోట్లు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టింది.
ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.12 వేలకు కుదించడం దారుణం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అతిపెద్ద యూటర్న్. 2024లో అసలు రైతుభరోసానే వేయలేదు. అన్నదాతలను వంచనకు గురి చేసిన కాంగ్రెస్ సర్కార్‌కు సరైన బుద్ధి చెప్పడం ఖాయం.
– మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నేత
రైతు ఆత్మగౌరవంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆటలాడుకుంటున్నరు. రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని నమ్మబలికి ఓట్లేయించుకున్న తర్వాత రూ.12 వేలకు కుదించి వంచించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో గొప్పలు చెప్పుకున్న రాహుల్‌గాంధీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి రైతులు ఊరూరా ఘోరీ కట్టే రోజు దగ్గరలోనే ఉన్నది.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఇది కోతల ప్రభుత్వం
రైతు భరోసా పేరిట గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి, ఎకరాకు రూ.12 వేలు మాత్రమే ఇస్తామని చెప్పడం సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనం. ఓట్లేసిన రైతులను నయవంచనకు గురిచేశారు. నిధుల్లేవనే సాకుతో కోతలు పెట్టడం దారుణం. ఇది చేతల ప్రభుత్వం కాదు. కోతల ప్రభుత్వం.
– కురువ విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నేత