హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, స్పీకర్‌పై ధికార పిటిషన్ విచారణ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహ్‌తో కూడిన ధర్మాసనం విచారణ ముగించినట్టు ప్రకటించింది. సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ, స్పీకర్ తుది ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది మోహిత్‌రావు స్పందిస్తూ, స్పీకర్ వెలువరించిన తీర్పు ప్రతులు తమకు అందలేదని చెప్పారు. స్పీకర్ తీర్పును సవాలు చేసేందుకు తీర్పు ప్రతులు అవసరమని పేర్కొన్నారు. తీర్పు ప్రతులు అందుబాటులో లేకపోవడంతో తదుపరి న్యాయపరమైన చర్యలకు ఆటంకం కలుగుతున్నదని వివరించారు.
స్పందించిన ధర్మాసనం.. శుక్రవారంలోగా తీర్పు ఉత్తర్వుల ప్రతులను పిటిషనర్లకు అందజేయాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. పూర్తి రికార్డును నాలుగు రోజుల్లో అందించాలని ఆదేశించింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఖైరతాబాద్ నుంచి ఎన్నికైన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ ఎంపీ టికెట్ పొందిన తన కుమార్తె గెలుపు కోసం ప్రచారం చేశారు. మిగిలిన 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించారనడానికి ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు వెలువరించారు. ఈ తీర్పు ప్రతులు అందగానే న్యాయ సమీక్ష చేసి హైకోర్టులో సవాలు చేయాలనే యోచనలో బీఆర్ఎస్ ఉన్నదని సమాచారం.