పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ ధరలు పెరిగి ఒకవైపు వంటింట్లో కుంపటి పెడుతుంటే.. భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం అర శాతం పెరిగి 3.21 శాతంగా నమోదైనట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) పేర్కొంది.
న్యూఢిల్లీ, మార్చి 12/ (స్పెషల్ టాస్క్ బ్యూరో): కొనబోతే కొరివే అన్నట్టు తయారైంది సగటు మనిషి బతుకు. కడుపునిండా కూడు తినలేక చాలీచాలని మెతుకులతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆదాయం పెరగడం ఏమోగానీ, ఖర్చులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి మరి. ప్రస్తుతం మార్కెట్లో ధరలు పుట్టిస్తున్న మంటలకు.. గురువారం విడుదలైన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) అధికారిక గణాంకాలే నిదర్శనం. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభించింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.21 శాతంగా నమోదైనట్టు ఎన్ఎస్వో అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అంతకుముందు నెల జనవరిలో ఈ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2.74 శాతంగానే ఉన్నది. దీంతో నెల రోజుల్లో దాదాపు అర శాతం (0.47%) సూచీ పెరిగినట్టు తేలింది. ప్రస్తుత భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా మున్ముందు ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నది.
రిటైల్ ధరల సూచీ పెరుగడం వెనుక.. ఆహార ద్రవ్యోల్బణం కనిపిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ వివరాలే స్పష్టం చేస్తున్నాయి. జనవరిలో 2.13 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆ మరుసటి నెలలో 3.47 శాతానికి ఎగబాకింది. దీంతో నిత్యావసరాల ధరలు భగ్గుమన్నాయి. కొబ్బరి, క్యాలీఫ్లవర్, టమాట వంటి కూరగాయలు, పప్పులు, వంట నూనె రేట్లు పెరుగడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. కాగా, బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినమ్ ఆధారిత నగల రేట్లు ఎక్కువయ్యాయని, ఇది కూడా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఎగదోసినట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలావుంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేట్లు వరుసగా 3.37 శాతం, 3.02 శాతంగా నమోదైనట్టు ఎన్ఎస్వో పేర్కొన్నది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధిని మూసేయడం వంటి పరిణామాలతో ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులు.. భారత్ సహా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నాయి. దేశీయ ఇంధన అవసరాలు సుమారు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచే భారత్‌కు ముడి చమురు, గ్యాస్ వస్తున్నది. అయితే ఇరాన్ హొర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఈ సరఫరాకు బ్రేకులుపడ్డాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకుండాపోయింది. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు పెరిగిన సంగతి విదితమే. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ రేట్లూ పెరిగితే.. రవాణా ఖర్చులూ ఎగబాకడం ఖాయం. ఇదే జరిగితే అన్నింటి ధరలూ పెరుగుతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం ఆకాశానికి చేరడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన వంటగ్యాస్ ధరలతో కుదేలవుతుంటే, ఇప్పుడు నిత్యావసరాల ధరల మంటతో సామాన్యుడి జేబులు చిల్లుపడటం ఖాయమని చెప్తున్నారు.
మార్చి తొలి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎరువుల తయారీపై కూడా ప్రభావం పడుతున్నట్టు చెప్తున్నారు. వెరసి ఈ పరిణామం రానున్న రోజుల్లో ఆహార పంటలపై ఎక్కువగానే ప్రభావం చూపుబోతున్నట్టు తెలుస్తున్నది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక మార్కెట్లో బియ్యం, గోధుమలతో పాటు నిత్యావసరాల ధరలు మరింత పెరుగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇక, ద్రవ్యోల్బణం పెరుగుదల వెనుక కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత్.. వర్షాధార పంటల దేశం. వర్షాలు ఏటా సమద్ధిగా పడొచ్చు. పడకపోవచ్చు. కాబట్టి మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా ఆయా ఉత్పత్తుల నిల్వల్ని ఎప్పుడూ ఉంచాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ధరలు స్థిరంగా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. నిల్వలు లేకనే నిత్యావసరాలు, ముఖ్యంగా మెజారిటీ పప్పు దినుసుల కిలో ధర సగటున రూ.150 పలుకుతున్నదని పేర్కొంటున్నారు.
పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ నేపథ్యంలో రాబోయే ద్రవ్య సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణ కట్టడి బాధ్యత ప్రధానంగా ఆర్బీఐదే. ద్రవ్య వ్యవస్థలో నగదు చలామణిని వడ్డీరేట్ల పెంపు, తగ్గింపు ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెడుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ వృద్ధిరేటు కంటే.. ద్రవ్యోల్బణ అదుపునకే సెంట్రల్ బ్యాంక్ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇరాన్ యుద్ధం ఆగిపోయి.. ముడి చమురు, గ్యాస్ సరఫరా మునుపటి స్థితికి వస్తే.. తిరిగి ఆర్బీఐ జీడీపీ బలోపేతంపై దృష్టిపెట్టే వీలుందని కూడా చెప్తున్నారు. కానీ అందుకు సమయం పడుతుందని, కాబట్టి వచ్చే నెల సమావేశంలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచడం లేదా అలాగే ఉంచవచ్చని అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఫిబ్రవరి ద్రవ్యసమీక్షలోనూ వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించలేదు. దీంతో ఈసారైనా కోతలుంటాయనుకుంటే.. రుణగ్రహీతల ఆశలపై గల్ఫ్ యుద్ధం, ద్రవ్యోల్బణం నీళ్లు చల్లాయనిపిస్తున్నది.

జాతీయ గణాంకాల కార్యాలయం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో మిగతా అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణలోనే ధరలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో అత్యధికంగా ద్రవ్యోల్బణం 5.02 శాతంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే మిజోరంలో అత్యల్పంగా 0.1 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఎంచుకున్న 1,407 నగర-పట్టణ మార్కెట్లు (ఆన్లైన్ వేదికలు సహా), 1,465 గ్రామాల నుంచి సేకరించిన రియల్-టైమ్ ప్రైస్ డాటా ఆధారంగా ఎన్ఎస్వో ఈ మేరకు ప్రకటించింది. కాగా, ఆహారోత్పత్తులతోపాటు, ఆహారేతర వస్తూత్పత్తులు, ఇంధన ధరలు, పసిడి-వెండి ఇతరత్రా విలువైన లోహాల ధరలు.. అన్నీ ఎక్కువగానే ఉన్నట్టు ఎన్ఎస్వో ఈ సందర్భంగా చెప్తున్నది.
కేంద్రంలో మోదీ అధికారంలోకి రాకముందు నెలకు పదివేల జీతమే వచ్చినా అన్ని ఖర్చులూ పోను నెలకు రూ. వెయ్యి దాచుకొనేవాళ్లం. ఇప్పుడు ముప్పై వేలు వస్తున్నా.. ఏ మూలకూ సరిపోవడం లేదు.
– ఓ వేతనజీవి ఆవేదన!
బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో నడిచిన ద్రవ్యోల్బణం.. ఇప్పుడు పరుగెత్తడం ప్రారంభించింది.
– ఓ ఆర్థిక విశ్లేషకుడి అభిప్రాయం!!