హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకుని ఉత్తర వాయవ్యంగా ప్రయాణిస్తూ జార్ఖండ్ వైపు వెళ్తున్నది. దీని ప్రభావంతో ఈ నెల 23 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి ఈ నెల 21వరకు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నదని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నట్టు అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అకడకడ భారీ వర్షాలు పడనుండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో 4.24 సెం.మీ, ఇల్లంతకుంటలో 3.97 సెం.మీ, తంగెళ్లపల్లిలో 3.60 సెం.మీ, ఎల్లారెడ్డిపేటలో 3.66 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండలో 3.80 సెం.మీ, నిర్మల్ జిల్లా పెంబీలో 3.30 సెం.మీ, దిలావర్పూర్లో 2.57 సెం.మీ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేటలో 3.24 సెం.మీ, ఖమ్మం జిల్లా వెంసూర్లో 2.82 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో 2.58 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
డిసెంబర్ నాటికి ఎల్ నినో తీవ్రరూపం దాల్చనున్నట్టు వాతావరణ పరిశోధకులు తెలిపారు. దీని ప్రభావంతో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు తీవ్రంగా వేడెక్కుతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో వచ్చే ఈశాన్య రుతుపవనాలు కూడా బలహీనపడతాయని హెచ్చరించారు. యాసంగిలో సాగునీటి సమస్య తలెత్తడంతోపాటు వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడనున్నట్టు అంచాన వేస్తున్నారు.