సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 01:38:07

భూ కబ్జాలో బరితెగింపు

భూ కబ్జాలో బరితెగింపు

  • ఆక్రమణల కూల్చివేతకు వెళ్లిన సిబ్బందిపై దాడి
  • కారంచల్లి.. పెట్రోల్‌పోసి నిప్పంటించి బీభత్సం
  • జవహర్‌నగర్‌ సీఐకు తీవ్ర గాయాలు
  • కబ్జాదారులకు బీజేపీ అండదండలు

జవహర్‌నగర్‌: కబ్జాదారులు బరి తెగించారు. ప్రభుత్వస్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణానికి కూల్చేందుకు వెళ్లిన పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. కండ్లలో కారంచల్లి, పెట్రోల్‌ పోసి నిప్పంటించి బీభత్సం సృష్టించారు. మంటలు అంటుకుని సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సర్వేనంబర్‌ 432లో 1500 గజాల ప్రభుత్వ స్థలం ఉన్నది. ఈ స్థలంలో మెడ్రన్‌ షీ టాయిలెట్లు నిర్మించాలని అప్పటి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు నిర్ణయించారు. విషయా న్ని ముందే పసిగట్టిన కబ్జాదారులు రాత్రికిరాత్రే ఆ స్థలంలో రూంను నిర్మించారు. మరుసటిరోజు తాసిల్దార్‌ గౌతమ్‌కుమార్‌ ఆ నిర్మాణాన్ని తొలగించారు. కబ్జాదారులు ఇటీవల మళ్లీ రూంను నిర్మించి స్థలాన్ని ఆక్రమించారు. దానిని తొలగించేందుకు గురువారం రెవెన్యూ, కార్పొరేషన్‌ సిబ్బంది, పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. గమనించిన కబ్జాదారులు రూంలోకి వెళ్లి లోపల నుంచి గడియ పెట్టుకుని.. గదిని కూల్చివేస్తే పెట్రోల్‌ పోసుకుని చనిపోతామంటూ బెదిరింపులకు దిగారు. కొంతమంది గది బయట కూర్చుని పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి స్థానిక బీజేపీ నేతలు మద్దతివ్వడంతో మరింత రెచ్చిపోయారు. దాదాపు నాలుగు గంటలపాటు హైడ్రామా నడిపారు. అధికారులు గదిని తొలిగించేందుకు ముందుకెళ్లేందుకు సమాయత్తమవగా  వారి కండ్లల్లో కారం పొడి చల్లుతూ రెచ్చిపోయారు. గదిలో ఉన్నవారు కర్రలకు బట్టలు చుట్టి వాటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి బయటకు విసిరారు. గదిలో పొగలు కమ్ముకోవడంతో అందులో ఉన్నవారిని కాపాడేందుకు వెళ్లిన సీఐ భిక్షపతిరావుపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించిన గుడ్డతో దాడిచేశారు. దీంతో ఆయన చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. తాసిల్దార్‌ గౌతమ్‌కుమార్‌, కమిషనర్‌ నేతి మంగమ్మను సైతం కబ్జాదారులు టార్గెట్‌ చేయడంతో సిబ్బంది వారిని అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. కాలినగాయాలతో సీఐ భిక్షపతిరావు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 

ప్రభుత్వాధికారులపై దాడులను ఖండిస్తున్నాం

అధికారులపై కబ్జాదారుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ట్రెసా ప్రధానకార్యదర్శి గౌతమ్‌కుమార్‌ అన్నారు. ఇటాంటి ఘటనలు పునరావృతం కాకుం డా కఠినచర్యలు తీసుకోవాల్సి ఉన్నదన్నారు. 


logo