VRA | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏలు ధర్నాకు దిగారు. జీవో నంబర్ 81, 85పై పునఃపరిశీలించాలని రేవంత్ రెడ్డికి విన్నవించేందుకు వారు సీఎం నివాసానికి చేరుకున్నారు. కానీ సీఎం ఇంట్లో లేకపోవడంతో.. బాధితులు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. నిరసనకు దిగిన వీఆర్ఏలను పోలీసులు అక్కడ్నుంచి పంపించేశారు.
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పేస్కేల్, 61 ఏండ్లు దాటినవారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నం.81, 85 విడుదల చేసిందని వీఆర్ఏలు గుర్తు చేశారు.. ఈ మేరకు వీఆర్ఏల్లో డిగ్రీ చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్‌గా, ఇంటర్ చదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్లుగా, పదో తరగతి చదివిన వారికి ఆఫీస్ సబార్డినేట్లుగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చిందని వివరించారు.
61 ఏండ్లకు పైబడిన 3,797 మంది వారసులకు ఉద్యోగాలు ఇస్తామని జీవోలో ఆనాటి ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఇదే విషయమై ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర నేతలు తమకు అనుకూల హామీలు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం సీసీఎల్ఏ నవీన్‌మిట్టల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసిందని గుర్తుచేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చి నెలలు గడుస్తున్నా అమలు చేయడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Group-1 Mains | గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
Group-1 Mains | గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ