శనివారం 11 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:24:36

జీవో 3 రద్దుపై సుప్రీంకు

జీవో 3 రద్దుపై సుప్రీంకు

  • గిరిజన టీచర్ల రిజర్వేషన్ల రద్దుపై రివ్యూ పిటిషన్‌ వేయాలి
  • అధికారులకు కేసీఆర్‌ ఆదేశం
  • ఎస్టీలకు అండగా ప్రభుత్వం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ల పోస్టులను వందకు వంద శాతం స్థానిక గిరిజనులకు రిజర్వు చేస్తూ ఇచ్చిన జీవో (నం. 3/2000)ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్‌ వేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను అధ్యయనం చేసి వెంటనే రివ్యూ పిటిషన్‌ వేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పుతో స్థానిక గిరిజనులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరఫున న్యాయపోరాటం చేయాలని ప్రభుత్వ విప్‌ రేగ కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 

రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో పేర్కొన్న షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు చెందిన స్థానికులకు అదే ప్రాంతంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించే విషయంలో 100 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో జారీచేసింది. దీనిపై కొందరు కోర్టుకెళ్లగా.. విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఇటీవల ఆ జీవోను కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్థానిక ఎస్టీలకు నష్టం జరుగుతుందని టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 1950 జనవరి 26కు ముందు నుంచి స్థానికంగా నివాసముంటున్న ఎస్టీలకు స్థానిక ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్‌ ఇచ్చే పద్ధతి ఉన్నదని, దీనివల్ల ఎస్టీలు కొద్దో గొప్పో ప్రయోజనం పొందారని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఈ జీవోను కొట్టేయడం వల్ల ఎస్టీలు రిజర్వేషన్‌ సౌకర్యం కోల్పోతారని వారు వివరించారు. రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులకు సుప్రీంకోర్టు తీర్పు భంగకరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయపోరాటం చేయాలని అభ్యర్థించారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఎస్టీలకు రిజర్వేషన్‌ కొనసాగించడం సముచితమని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రివ్యూ పిటిషన్‌ వేస్తామని స్పష్టంచేశారు. ఎస్టీల రిజర్వేషన్‌ సౌకర్యం యథావిధిగా కొనసాగేలా అవసరమైన వాదనలతో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీలకు రాజ్యాంగమే ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కల్పించిందని సీఎం చెప్పారు. వాటిని కాపాడే విషయంలో ఎస్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.


logo