బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:05

ఇక అంతా ఈ-ఆఫీస్‌

ఇక అంతా ఈ-ఆఫీస్‌

  • ప్రభుత్వ ఆఫీసుల్లో డిజిటల్‌ ఫైలింగ్‌ 
  • కరోనా నేపథ్యంలో పాలనామార్పులు
  • ప్రతిశాఖకు నోడల్‌ అధికారి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ 
  • ప్రతి ఉద్యోగి, అధికారికి ప్రత్యేక ఐడీ, పాస్‌వర్డ్‌ 
  • ముద్ర సాఫ్ట్‌వేర్‌ ద్వారా సంతకాల సేకరణ
  • ఈ నెల 13నుంచి అమల్లోకి కొత్త విధానం 

కరోనా వైరస్‌  అన్ని శాఖలకు పాకుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రక్షణ చర్యలకు ఉపక్రమించింది. కార్యాలయాల్లో సులభతర పాలనకు శ్రీకారం చుట్టింది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎలాంటి ఫైల్‌ అయినా డిజిటల్‌ పద్ధతిలోనే తయారయ్యేలా ప్రణాళిక రూపొందించింది. ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చి అన్ని ఫైళ్లను డిజిటల్‌ రూపంలోనే రూపొందించేలా ఆదేశాలిచ్చింది.  వచ్చే సోమవారం నుంచి ఈ- ఆఫీస్‌ విధానం అమల్లోకి రానున్నది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై పేపర్‌ ఫైళ్లకు స్వస్తి చెప్పనున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న  నేపథ్యంలో డిజిటల్‌ ఫైలింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంతోపాటు, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా సులభతర పాలన మొదలుకానున్నది. నోట్‌ఫైల్‌తో సహా ప్రతి కరస్పాండెన్స్‌ ఈ ఫైల్‌ ద్వారానే జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు అన్నిశాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మంగళవారం నాటికి ఉద్యోగుల మాస్టర్‌ డాటాను రూపొందించాలని స్పష్టంచేసింది. ఈ-ఆఫీస్‌ నిర్వహణ కోసం కావాల్సిన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ వివరాలతోపాటు డిజిటల్‌ సంతకాలు సేకరించాలని  పేర్కొన్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిశాఖ ఒక నోడల్‌ అధికారి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ను నియమించుకుంటున్నది. అన్నిఏర్పాట్లు పూర్తిచేసుకొని వచ్చే సోమవారం నుంచి ఈ-ఆఫీస్‌ ద్వారానే పరిపాలన చేపట్టాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నది. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, ఆబ్కారీ, వాణిజ్యపన్నులు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, దేవాదాయశాఖల్లో ముందుగా ఈ-ఆఫీస్‌ ప్రక్రియను ప్రవేశపెట్టి మిగతా శాఖల్లో తదరుపరి దశల్లో అమలుచేయనున్నది.  

రేపటిలోగా ఫైళ్ల డిజిటలైజేషన్‌

ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నెల 8వ తేదీలోగా ఫైళ్లన్నింటినీ డిజిటలైజ్‌ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అవసరమైన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సమకూర్చుకోవాలని, ఉద్యోగుల మాస్టర్‌ డాటాబేస్‌ తీసుకోవాలని, హైరార్కీ మ్యాపింగ్‌తోపాటు ప్రతి ఉద్యోగికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ రూపొందించాలని సూచించింది. ముద్ర అప్లికేషన్ల ద్వారా ఉద్యోగుల డిజిటల్‌ సంతకాలను తీసుకోవాలని ఆదేశించింది. ఈ-ఆఫీస్‌ ఫైళ్ల నిర్వహణపై 9నాటికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి ఉద్యోగి, అధికారికి అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగిన ‘ఎన్‌క్రిప్టెడ్‌ డిజిటల్‌ కీ’ ఉంటుంది. దీనిద్వారా ఫైళ్లు, డాటా తదితర సమాచారం ట్యాంపర్‌ కాకుండా భద్రంగా ఉంటుంది. ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు మొబైల్‌లో చూసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ-ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ను కేంద్రప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ రూపొందించింది. ప్రతి ఉద్యోగి, అధికారి తన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తో ఈ- ఆఫీస్‌లోకి వెళ్లి డిజిటల్‌ ఫైళ్లను క్రియేట్‌ చేయవచ్చు, నిర్వహించవచ్చు.


logo