అందరికీ దళిత బంధు వస్తది.. ఆగం కావద్దు
దేశానికి ఆదర్శంగా తెలంగాణ దళిత బంధు పథకం
నవ శకానికి మరో అంబేద్కర్ కేసీఆర్
హుజూరాబాద్ : దళిత బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదు.. దళితులను బాగు చేసే స్టంట్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు. దళిత బంధు అందరికీ వస్తుంది.. ఆగం కావొద్దు అని సూచించారు. దేశానికే ఈ పథకం ఆదర్శంగా నిలవబోతుందని, నవశకానికి మరో అంబేద్కర్ కేసీఆర్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో మీడియాతో ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని ఎమ్మెల్యే కొనియాడారు. సింహ గర్జన అయినా సంక్షేమ పథకం అయినా కరీంనగర్ జిల్లా నుండే మొదలవుతుందని గుర్తు చేశారు. ఈ గడ్డ మీద నుంచి ఏ పథకం ప్రారంభించినా వందకు వంద శాతం విజయవంతం అవుతుందన్నారు.
ఈ పథకం అమలుతో దళితులు ఎదుగుతారనే అనే ఈర్ష్య ప్రతిపక్షాల్లో మొదలైందన్నారు. రాబోయే మూడేండ్లలో ప్రతి దళిత కుటుంబానికి లబ్ది చేకూరుతుందన్నారు. నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. దళిత బంధు డబ్బులు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. దళితుల ఆర్థిక ఎదుగుదలకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు దళితులందరూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు.
ఎస్సీ సబ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం రూ. 1500 కోట్లు కేటాయించారని, అవసరమైతే మరో రూ. 500 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. గతంలో దళితులను ఓటు వేసే యంత్రాలుగా పరిగణించేవారు. కానీ కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రవిశంకర్ ప్రశంసించారు.