సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:45:44

అతిత్వరలో గజ్వేల్‌కు రైలు

అతిత్వరలో గజ్వేల్‌కు రైలు

  • నూతన మార్గంలో రైల్వే భద్రతా తనిఖీలు పూర్తి
  • మనోహరాబాద్‌- గజ్వేల్‌ మధ్య 31 కిలోమీటర్లు
  • నడుమ నాచారం, ఎల్కల్‌ బేగంపేట రైల్వేస్టేషన్లు
  • రైల్వే లెవల్‌ క్రాసింగ్‌లు లేకుండా నిర్మాణం పూర్తి

గజ్వేల్‌ ప్రాంత ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైలు ప్రయాణం కల త్వరలోనే సాకారం కానున్నది. మనోహరాబాద్‌- కొత్తపల్లి మార్గంలో మొదటిదశ 31 కిలోమీటర్లు గజ్వేల్‌ వరకు పనులు పూర్తవడంతో మార్గం సుగమమైంది. ఇప్పటికే రైల్వే భద్రతా తనిఖీలు కూడా పూర్తయ్యాయి. ఇక రైలు నడుపుడే తరువాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అతిత్వరలో గజ్వేల్‌లో రైలు కూత వినిపించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మనోహరాబాద్‌- కొత్తపల్లి 151 కిలోమీటర్ల మార్గంలో మొదటిదశ 31 కిలోమీటర్ల మనోహరాబాద్‌- గజ్వేల్‌ రైల్వేలైన్‌ పనులు పూర్తయ్యాయి. భద్రతా తనిఖీలు పూర్తిచేసిన రైల్వే అధికారులు ప్యాసింజర్‌ రైళ్లు నడిపేందుకు అనుమతించారు. దీంతో త్వరలోనే గజ్వేల్‌ ప్రాంత ప్రజలకు రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. రూ.1,160 కోట్ల అంచనా వ్యయంతో 2016 లో రైల్వే పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపనచేశారు. ఈ లైన్‌ గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లికి చేరుకోనున్నది. 

ఈ ప్రాజెక్టు వ్యయంలో 33 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఈ పనులను ఐదు దశల్లో పూర్తిచేయడానికి ప్రణాళిక రూపొందించారు. అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి రైల్వేశాఖకు అప్పగిస్తున్నది. 2018లో రైల్వేలైన్‌ పనులు ప్రారంభమయ్యాయి. భూసేకరణ అనంతరం 24 నెలల రికార్డు సమయంలో మొదటిదశ 31 కిలోమీటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌వరకు మధ్యలో రెండు రైల్వేస్టేషన్లు నాచారం, ఎల్కల్‌ బేగంపేట ఉన్నాయి. ఈ రైల్వేలైన్‌లో భాగంగా 61 వంతెనలను నిర్మించారు. ఇందులో నాలుగు భారీ వంతెనలు కాగా, 45 మైనర్‌ వంతెనలు ఉన్నాయి. ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు ఎలాంటి రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ లేకుండా ప్రణాళిక రచించి పనులు పూర్తిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా టన్నెల్‌ మీదుగా రైల్వేలైన్‌ వెళ్లింది. గజ్వేల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద 51 మీటర్ల పొడవైన విల్లు ఆకారం స్ట్రింగ్‌ గర్డర్‌ను ఏర్పాటుచేశారు.

ప్రాజెక్టు దశలవారీగా చేసే పనులు

దశ
ప్రాంతాలు
కిలోమీటర్లు 
మొదటి
మనోహరాబాద్‌- గజ్వేల్
31
రెండు
గజ్వేల్‌- కొడకండ్ల
10 
మూడు
కొడకండ్ల- సిద్దిపేట
34
నాలుగు
సిద్దిపేట- సిరిసిల్ల
37 
ఐదు
సిరిసిల్ల- కొత్తపల్లి
39 
మొత్తం

151


logo