శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 01:35:24

పెండ్లింట చోరీ కేసు ఛేదన

పెండ్లింట చోరీ కేసు ఛేదన

  • 61 తులాల బంగారం, రూ.2.80 లక్షలు స్వాధీనం

మహబూబ్‌నగర్‌ క్రైం: మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం బోయిన్‌పల్లిలోని పెండ్లింట జరిగిన చోరీకి సం బంధించిన కేసును పోలీసులు పన్నెండు రోజుల్లోనే ఛేదించారు. దొంగల ముఠా నుంచి 61 తులాల బంగారు నగలు, రూ.2.80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రెమారాజేశ్వరి బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మిడ్జిల్‌ మండలం బోయిన్‌పల్లికి చెందిన ఇంద్రారెడ్డి కుమారుడి పెండ్లి ఈనెల 23న జరగాల్సి ఉండగా అప్పటికే బంధువులు ఇంటికి చేరుకున్నారు. ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కాగా ఈ నెల 18న రాత్రి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. నగలు, నగదు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేరం జరిగిన తీరు ఆధారంగా పాత నేరస్థులను గుర్తించి దర్యాప్తు మొదలుపెట్టారు. దొం గలు సెల్‌ఫోన్లు కూడా వినియోగించకుండా చోరీకి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో అంగడి సురేశ్‌ అనే పాత నేరస్థుడి వేలిముద్రలను గుర్తించారు. అతడిని పట్టుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికోడూరుకు చెందిన అంగడి సురేశ్‌, దాసరి మురళీకృష్ణ, బొల్లంపల్లి పీరయ్య, ఖమ్మం జిల్లాకు చెందిన బిజిలి మల్లేశ్‌ ముఠా ఈ దొంగతనానికి పాల్పడినట్టు నిర్ధారించారు. వీరంతా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం తొర్రూర్‌లోని రాజీవ్‌ గృహకల్ప సముదాయంలో  నివాసం ఉంటున్నారు. 18న ఆటో తీసుకుని బోయిన్‌పల్లికి వచ్చారు. రాత్రి ఓ ఇంట్లో చోరీ చేయగా రూ.18 వేల నగదు దొరికింది. పక్కనే ఇంద్రారెడ్డి పెద్ద ఇల్లు కనిపించడంతో ఆ ఇంట్లోకి చొరబడ్డారు. బెడ్రూంలోని బీరువాను తెరిచి బంగారు నగలు, నగదు అపహరించారు. బెడ్రూంలో పెండ్లి కొడుకు, అతని తల్లి నిద్రిస్తున్నా ఏ మాత్రం అలికిడి లేకుండా చోరీ చేశారు. మిడ్జిల్‌లో పల్సర్‌ వాహనాన్ని, తలకొండపల్లిలో మరో పల్సర్‌ వాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఈ వాహనాలను మహబూబాబాద్‌లో విక్రయిచేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు వారిని పట్టుకొని అరెస్టు చేశారు. వారి నుంచి 61 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.2.80 లక్షల నగదు, చోరీకి ఉపయోగించిన ఆటో, రెండు పల్సర్‌ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  


logo