మండే సూర్యుడిపై మబ్బుల
దుప్పటి కప్పి
మేఘాలన్నీ గర్జిస్తున్నాయి
గాలి దుమారం కాస్త జనజీవన స్రవంతిని
అతలాకుతలం చేసే పనిలో నిమగ్నమైంది
గోదాముల్లో ఉండాల్సిన వడ్లిప్పుడు
తారు రోడ్డుపై తలలార బెట్టుకుంటున్నాయి
ఇప్పుడిక్కడ ఎవరూ సుఖంగా లేరు
అందరూ దుఃఖ నదిలో కొట్టుకుపోతున్నవాళ్లే
ఏ మేఘం వచ్చి
వడగళ్లను విసురుతుందో
ఏ తుపాను వచ్చి
పంటలన్నీ ఊడ్చి వెళుతుందో
ఏ ఈదురుగాలి
గుడిసెలతో పాటు ప్రాణాలనెగరేసుకు పోతుందో
ఎవరికీ అంతుపట్టకుండా ఉన్నది
నష్టపరిహారం నష్టాన్ని పూరించలేకపోతోంది
ఓదార్పుయాత్రలు
కన్నీళ్లకేమీ అడ్డుకట్టలేయలేక పోతున్నాయి
వాగ్దానాలన్నీ వలస పక్షుల్లా ఎగిరిపోతున్నాయి
చేసిన అప్పులు
ఉరితాళ్లయి మెడకు చుట్టుకుంటున్నాయి
ఎవరు చేస్తేనేం? గాయం గాయమే
గాయం చిన్నదైతేనేం, పెద్దదైతేనేం
విరిగిన మనసు అతుక్కుంటుందా?
పోయిన ప్రాణాన్ని తిరిగి నిలబెడుతుందా?
పూడ్చుకోలేని నష్టమైతే జరిగింది
తీర్చుకోలేని బాధలైతే పెరిగాయి
అకాల వర్షాలు, వడగళ్ల వానలు
పిలువని అతిథులేం కాదు
తేలాల్సిందల్లా వాళ్లను పిలిచిందెవరని?
-ఎన్ నరేశ్ చారి
97013 34516