ములుగు, నవంబర్15 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లాలోని విద్యాశాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక సొంత ఇలాకలో నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఏఎంవోను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక్కడి డీఈవో పాణి, కార్యాలయ ఉద్యోగి దిలీప్ కొన్ని నెలల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విష యం తెలిసిందే. అయినా కలెక్టర్‌తో సహా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో సమగ్ర శిక్షలో ఏఎంవోగా ఉన్న మల్లారెడ్డిని తప్పించి నూతన నియామకానికి దరఖాస్తులు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రస్థాయి పరీక్ష రాసినవారిని లేదా గెజిటెడ్ హెడ్మాస్టర్లను తీసుకోవాల్సి ఉంటుంది. వారు లేకపోతే వేరే వారిని నియమించాల్సి ఉంటుంది. కానీ విద్యాశాఖ నియామకాలను తుంగలో తొకి సూల్ అసిస్టెంట్ శ్యామ్‌సుందర్‌ను ఏఎంవోగా నియమించడంతో ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
జిల్లాలో ఏఎంవో పోస్టుకు రాష్ట్రస్థాయి పరీక్షల్లో అర్హులైన జాతీయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు కూడా ఉన్నారని, పరీక్ష రాసిన వారికి, జిల్లాలో స్థానికంగా ఉండే వారికి ఇవ్వకుండా హనుమకొండలో ఉన్నవారికి ఇవ్వడం హెచ్ఎంలు, ఉత్తమ ఉపాధ్యాయులను కించపర్చినట్లు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపాధ్యాయులను కాదని అగ్రవర్ణ కుల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయడం సరైంది కాదని, ప్రతీ పనికి కలెక్టర్, మంత్రి పేరు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేస్తున్నారని, మితిమీరిన రాజకీయ జోక్యం ఎకువై ‘విద్యాశాఖ మిథ్యశాఖ’గా మారిందని ఆరోపిస్తున్నా రు. గతంలో ఉమ్మడి జిల్లాలో అవినీతి ఆరోపణలతో సైన్స్ అధికారిని తొలగించిన వ్యక్తికి పోస్టు ఇవ్వడం అవినీతికి దారులు తెరిచినట్లేనని పేర్కొంటున్నారు.
అంతర్జాతీయ ఎక్స్పోజర్ సందర్శన, విద్యా మార్పి డి కార్యక్రమానికి ఎంపిక చేసే ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులను ఎస్జీటీ 1, సూల్ అసిస్టెంట్ 1, గెజిటెడ్ హెడ్మాస్టర్ 1గా ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ అందులో కూడా గెజిటెడ్ హెడ్మాస్టర్ స్థానంలో శ్యామ్‌సుందర్‌ను నియమించడం విద్యాశాఖ అవినీతికి తారాణంగా చెప్పవచ్చని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకే ఒకడిని జిల్లాస్థాయి విద్యాశాఖలో 3 పోస్టుల్లో నియమించడం దారుణమని తెలుపుతున్నారు. శ్యామ్‌సుందర్ అక్రమ నియామకాన్ని రద్దు చేసి విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, జిల్లా వాసులు, మేధావులు, విద్యార్థి, ప్రజా సంఘాలు, నాయకులు మంత్రి సీతక్కను కోరుతున్నారు.