న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: భారత్-అమెరికా దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇరు దేశాలు శుకవ్రారం దీనిపై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై అమెరికా ఇటీవల సుంకాలను 18 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇది చారిత్రక విజయంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను కల్పిస్తుందన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తుందన్నారు.
అమెరికా రైతులకే మేలు: కాంగ్రెస్
యూఎస్-భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేసింది. ‘హౌడీ మోదీ’ కంటే ‘నమస్తే ట్రంప్’ పైచేయి సాధించారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ శనివారం ఆరోపించారు. దేశంలోని రైతుల ప్రయోజనాలు దెబ్బతీసి మరీ.. అమెరికా రైతులకు సాయం చేకూరేలా భారత్ దిగుమతులపై మోదీ ప్రభుత్వం సుంకాలు తగ్గించనుందని తెలిపారు. అమెరికా దిగుమతులు మూడు రెట్లు ఎక్కువ కావడంతో మన వాణిజ్య మిగులు మాయం అవుతుందని అన్నారు.
రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు బంద్!
రష్యా నుంచి చమురును కొనుగోలు చేయమని భారత్ హామీ ఇవ్వడంతో టారిఫ్‌ల తగ్గింపు నిర్ణయాన్ని అమెరికా అమలు చేయడం ప్రారంభించింది. రష్యా నుంచి నేరుగా కానీ, పరోక్షంగా కానీ చమురును కొనబోమని భారత్ తమకు హామీ ఇచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం అమల్లోకి రావడంపై ప్రధాని మోదీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్‌కు వాణిజ్య లోటు తప్పదా?
అమెరికాతో భారత్ పూర్తి ఏకపక్షంగా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశానికి భవిష్యత్‌లో పలు స్థాయిల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ప్రస్తుతం అమెరికాతో భారత్ 130 బిలియన్ యూఎస్ డాలర్ల (సుమారు రూ.11.8 లక్షల కోట్లు) వాణిజ్యాన్ని రెండు వైపులా జరుపుతూ 45 బిలియన్ల వాణిజ్య మిగులును భారత్ పొందుతున్నది. కొత్త వాణిజ్య ఒప్పందంతో భారత్ వాణిజ్య లోటులోకి దిగజారుతుంది. భవిష్యత్తులో రైతులు, ఇతర వర్గాల వారిని రోడ్డున పడేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈస్ట్ ఇండియా సైతం ఈర్ష్య పడేలా!
ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య వార్షిక వాణిజ్యం దాదాపు 130 బిలియన్ డాలర్లు. అమెరికా ఎగుమతులు దాదాపు 40 బిలియన్ డాలర్లు. అయితే రానున్న ఐదేండ్లలో 500 బిలియన్ డాలర్ల విలువగలవి దిగుమతి చేసుకోవడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే మనం ఎగుమతి చేసే ఎగుమతుల విలువ 40 మిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 100 బిలియన్ డాలర్లు. పైగా మనం ఎగుమతి చేసే 40 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులకు 18 శాతం వంతున టారిఫ్‌లు చెల్లించాలి. వారు మన దేశానికి దిగుమతి చేసే వస్తువులకు జీరో శాతం టారిఫ్. ఇది నిజంగా గొప్ప ఒప్పందం ఎలా అవుతుందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ సైతం ఈర్ష్య పడేలా భారత్ కొంపముంచేలా ఈ ఏకపక్ష ఒప్పందం ఉందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
మా వాణిజ్య లోటును పూడ్చుకుంటాం: యూఎస్
ఈ ఒప్పందంతో అమెరికాకు అనూహ్య లాభం చేకూరనుంది. అమెరికా వ్యవసాయ కార్యదర్శి బ్రూక్ రోలిన్స్ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌తో ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘భారతదేశం తన వ్యవసాయ రంగాన్ని అమెరికా ఉత్పత్తుల కోసం తెరవడానికి చేసిన ప్రతిపాదన అమెరికా వ్యవసాయ రంగంలో భారత దేశంలో ఉన్న 1.3 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును తుడిచిపెట్టడానికి సహాయపడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.