హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండిచేయి చూపింది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రూ.12వేల ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటారని ఆశించి భంగపడినట్టు ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన క్యాబినెట్ నిర్ణయాల్లో ఆటోడ్రైవర్ల ఊసే లేకపోవడం తీవ్రంగా కలచివేసిందని ఆటోడ్రైవర్ల జేఏసీ ఆవేదన వ్యక్తంచేసింది. పెట్రోల్, డీజిల్ వాహనాలను మార్చడంపై ఉన్న శ్రద్ధ.. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలపై ఎందు కు లేదని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే దాదాపు 170 మంది వరకు ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు పథకంతో వచ్చిన ఆర్థిక నష్టాలతో ఈఎంఐలు చెల్లించకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. తక్షణం ప్రభుత్వం ప్రకటించిన డబ్బులను లెక్క కట్టి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోతే సమ్మెకు దిగుతామని ఆటోడ్రైవర్ల జేఏసీ హెచ్చరించింది.