(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ మేరకు ‘యునైటెడ్ స్టేట్స్-ఇండియా జాయింట్ స్టేట్మెంట్’ పేరిట శ్వేత సౌధం ఓ ప్రకటనను విడుదల చేసింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఈ డీల్ ఇరు దేశాలకు ఓ గుడ్ న్యూస్ అంటూ తెగ సంబురపడిపోయారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్నో చారిత్రాత్మక విజయంగా చెప్పుకొచ్చారు. అయితే, ఈ డీల్‌లో మెజారిటీ ప్రయోజనాలు అమెరికాకే దక్కుతున్నాయని, భారత్‌కు లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ మేరకు ఐదు కారణాలను విశ్లేషిస్తున్నారు.
1. టారిఫ్‌లు 18 శాతం పెరుగుదల
తాజా డీల్ ప్రకారం.. భారత్‌పై ప్రతీకార సుంకాలను 50 శాతం (రష్యా చమురు కొనుగోలుకు విధించిన 25 శాతం అదనపు సుంకంతో కలిపి) నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. అయితే, అమెరికాపై భారత్ విధిస్తున్న సుంకాలను సున్నాకు తగ్గించడం గమనార్హం. అంటే, అమెరికా ఉత్పత్తులపై మనం ఎలాంటి సుంకాలు విధించకపోయినా.. అగ్రరాజ్యం భారత ఉత్పత్తులపై 18 శాతం అదనపు సుంకాలను కొనసాగిస్తుందని అర్థం. ఇప్పుడు 18 శాతం సుంకాలు విధిస్తున్న ఉత్పత్తులపై ఏడాది కిందట అంటే ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి ముందు టారిఫ్‌లు జీరోగా ఉండేవి. అంటే గతంతో పోలిస్తే, టారిఫ్‌లు 18 శాతం పెరిగాయని అర్థం. ఇక, ఫార్మా, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలపై అమెరికా సుంకాలను ఎత్తేసిందని కేంద్రం గొప్పగా చెప్పుకొచ్చింది. అయితే, ఏడాది కిందట కూడా వీటి మీద ఎలాంటి సుంకాలు లేకపోవడం గమనార్హం
2. రూపాయి పయనమెటో?!
డీల్ ప్రకారం.. 500 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.45 లక్షల కోట్లు) పైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, మెటల్స్, ఇతర ఉత్పత్తులతో పాటు వీటికి అదనంగా మరిన్ని అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించిందని తెలుస్తోంది. అ అలా భారత్ చేసుకొన్న దిగుమతులకు డాలర్లలోనే చెల్లింపులు జరపాలి. ఇదే జరిగితే విదేశీ మారకపు నిల్వలు దారుణంగా పడిపోయే ప్రమాదం ఉన్నది. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే.. డాలర్‌తో పోలిస్తే ఇప్పటికే చారిత్రక కనిష్ఠాలకు పడిపోతున్న రూపాయి విలువ అధః పాతాళానికి పడిపోవడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
3. మన సాగుకు ఎగనామం
తాజా ట్రేడ్ డీల్‌తో మన రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్రం చెప్తోంది. అయితే, శ్వేత సౌధం విడుదల చేసిన డీల్ ప్రకటనలో అమెరికాకు చెందిన ఆహార, వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి సుంకాలు లేకుండా అనుమతించడానికి మోదీ ప్రభుత్వం ఒప్పుకొన్నట్టు స్పష్టంగా ఉన్నది. అంతేకాదు, పొడి ధాన్యం (డీడీజీ), పశువుల దాణాకు వినియోగించే ఎర్ర జొన్నలు, ట్రీ నట్స్, ప్రాసెస్ చేసిన తాజా పండ్లు, సోయాబీన్ ఆయిల్ వంటి వ్యవసాయ, ఆహార ఉత్పత్తులను జీరో టారిఫ్ లేదా నామమాత్రపు సుంకాలతో దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించినట్టు అమెరికా పేర్కొంది. అంటే, దేశంలోని 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేయడానికి ఈ ఒప్పందంతో మోదీ సిద్ధమయ్యారా? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను అనుమతిస్తే, దేశీయ ఉత్పత్తుల సంగతేమిటని నిలదీస్తున్నారు. స్వదేశీ నినాదానికి మోదీ పాతరేసినట్టేనా? అని ప్రశ్నిస్తున్నారు.
4. సార్వభౌమత్వానికే మచ్చ
రష్యా చమురును కొనుగోలు చేయడాన్ని నిలిపివేయడమే కాదు, రష్యా, వెనెజువెలా నుంచి మరింత చమురును కొనేందుకు భారత్ ముందుకు వచ్చిందని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ అందుకు అనుగుణంగా టారిఫ్‌లను సవరిస్తామని కూడా పరోక్షంగా హెచ్చరించారు. డీల్‌లోనూ పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అంటే, భారత దేశ సార్వభౌమాధికారం, ఇంధన భద్రతకు సంబంధించిన సార్వభౌమాధికారం అమెరికాకు మోదీ తాకట్టు పెట్టారా? అంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశ అంతర్గత నిర్ణయాల మీద అమెరికా పర్యవేక్షణ ఏమిటని నిలదీస్తున్నారు. మరోవైపు, రష్యా మనకు దశాబ్దాల నుంచి మిత్ర దేశం. చవగ్గానే అక్కడి నుంచి మనకు చమురు దిగుమతి అవుతుంది. ఇప్పుడు, ఈ ఒప్పందం ముసుగులో రష్యాతో సంబంధాలు తెంచుకొంటే.. అది భారత్‌కు ఆర్థికంగానే కాదు దౌత్యపరంగానూ ఎంతమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
5. అసలు పట్టించుకొంటేగా?
మధ్యంతర ట్రేడ్ డీల్‌పై మరో నాలుగైదు రోజుల్లో ఓ ప్రకటన వెలువడుతుందని గురువారం మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అయితే, ఆ మరుసటి రోజే ఈ డీల్‌పై శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు.. సాధారణ ప్రజలతో పాటు ఆ ప్రకటనను కేంద్ర పెద్దలు కూడా ఓపెన్ యాక్సెస్ మీడియా ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగినప్పుడు ఆ దేశాలకు చెందిన కీలక ప్రతినిధులు ఒకేసారి ప్రకటన చేయడం సంప్రదాయం. అయితే, ఇక్కడ అమెరికాదే పైచేయిగా మారింది. అంతేకాదు.. ట్రేడ్ డీల్ కుదిరిందన్న తొలి సమాచారం కూడా మొన్నటి ట్రంప్ ప్రకటన ద్వారానే తెలియడం గమనార్హం. ఇక, ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు తొలుత ట్రంప్ ప్రకటించడం ప్రస్తావనార్హం. దీన్ని బట్టి భారత్‌పై ట్రంప్ అజమాయిషీ చేస్తున్నారని, ఇది తెలిసినా మోదీ పరివారం వేడుక చూస్తున్నదని విమర్శలు వస్తున్నాయి.