మహేశ్వరం, ఫిబ్రవరి 7: మాంఖాల్లో రాయ్ కుంటను మాయం చేసేందుకు అధికార పార్టీ నేతల బలంతో రియల్ వ్యాపారులు బిగ్ స్కెచ్ వేశారు. కుంటను మట్టితో నింపేస్తున్నారు. మహేశ్వరం మండలం మాంఖాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 615లో ఉన్న ఈ రాయ్ కుంట విస్తీర్ణం 33.9 ఎకరాలు. 614 సర్వే నంబర్లో 19 ఎకరాల వరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. బఫర్, ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి పోసినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. కుంటలో మట్టిపోసి చెరువు ఆనవాళ్లు లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో మాంఖాల్ను డివిజన్ చేశారు. అవుటర్ రింగ్ రోడ్‌ను అనుసరించి ఉండటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ఖాళీ స్థలం మిగతా దొరికితే అక్కడ కబ్జాలు చేస్తున్నారు.
అధికార పార్టీ నేతల అండదండలతో యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారు. సర్వే నంబర్ 615,614లో ఉన్న రాయ్ కుంట కబ్జా అవుతున్నదని స్థానికులు ఫిర్యాదు చేసే వరకూ అధికారులకు సోయిలేదని మహేశ్వరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివగల్ల యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ సురేందర్, వుల వెంకటేశ్ యాదవ్, జగదీశ్ యాదవ్, శ్రీనివాస్ వెంకటేశ్ మండిపడుతున్నారు. రాత్రి సమయాల్లో బుల్డోజర్లతో తవ్వి మట్టితో చెరువులను పూడ్చేస్తున్నారని మహేశ్వరం తహసీల్దార్ చిన్న అప్పల నాయుడుకి, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికార బలంతో బెదిరిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. తమ వెనకాల మంత్రులు ఉన్నారని చెబుతున్నారన్నారు. దాడులకు సైతం పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
చెరువు శిఖంలో మట్టి పోశారు
రాయ్ కుంట చెరువు శిఖంలో మట్టి పోసింది నిజమే. చెరువు విస్తీర్ణం ఎంత ఉందో మాకు తెలియదు. ఎఫ్టీఎల్, బఫర్ మాత్రమే మాకు తెలుసు. చెరువును ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించం. చెరువు కబ్జా అయితే తహసీల్దార్ చూసుకుంటారు. చెరువు విస్తీర్ణం ఎంత ఉందో రెవెన్యూ అధికారులకే తెలుసు. చెరువుల కబ్జా గురించి తహసీల్దార్‌కు లెటర్ రాసాం. చెరువు ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తిస్తాం. ఇరిగేషన్ అధికారుల దగ్గర మ్యాప్‌లు మాత్రమే ఉంటాయి. చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం.
– ఇరిగేషన్ ఈఈ ప్రభాకర్