Death Penalty | రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మూడేళ్ల కిందట రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దినేష్ కుమార్ అనే నిందితుడికి హైకోర్టు ఉరిశిక్షణు ఖరారు చేస్తూ తీర్పును ఇచ్చింది. వాస్తవానికి 2017లో నార్సింగి ఠాణా పరిధిలో నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి, హత్య కేసులో 2021లో రంగారెడ్డి కోర్టు ఈ కేసులో నిందితుడైన దినేష్ కుమార్‌ను దోషిగా తేలుస్తూ ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే, నిందితుడు కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు కేసును విచారించిన హైకోర్టు.. దినేష్‌కు విధించిన ఉరిశిక్ష సబబేనంటూ బుధవారం తీర్పును ఇచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసు వివరాల్లోకి వెళిత.. అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఆర్యమిత్ర కార్మిక శిబిరంలో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాకు చెందిన దినేష్ అనే వ్యక్తి అక్కడే సెంట్రింగ్ పని చేసుకుంటూ ఉండేవాడు. ఒడిశా దంపతులతో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలోనే 2021, డిసెంబర్ 12న ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఆ దంపతుల కూతురుకు చాకెట్ల ఆశ చూపించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అందరికీ చెబుతుందనే భయంతో అక్కడే బండరాయితో మోదీ హత్య చేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండులు ఇంటి చుట్టుపక్కలతో పాటు పరిసర ప్రాంతాల్లో వెతికారు.
ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో చివరిసారిగా బాలిక దినేష్‌తో కనిపించిందని తేలింది. ఆ తర్వాత పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. దాంతో అతడిపై లైంగిక దాడి, హత్యతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కేసులో అన్ని సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో అభియోగపత్రాలను రంగారెడ్డి కోర్టుకు సమర్పించారు. నేరస్థుడికి ఉరి శిక్ష విధించాలని అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజిరెడ్డి వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి ఉరిశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పును హైకోర్టు సవాల్ చేయగా.. దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఉరిశిక్షను ఖరారు చేసింది.