పాట్నా: ఐదేళ్ల బాలుడు స్కూల్ బ్యాగ్‌లో గన్ తెచ్చాడు. ఒక విద్యార్థిపై కాల్పులు జరిపాడు. (Boy Shoots Student In School) దీంతో ఆ స్టూడెంట్ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. బీహార్‌లోని సుపాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లాల్‌పట్టి ప్రాంతంలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్లో ఐదేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నాడు. బుధవారం స్కూల్ బ్యాగ్‌లో గన్ దాచి పాఠశాలకు వచ్చాడు. మూడో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిపై ఆ గన్‌తో కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థి అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతడి చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనపై కాల్పులు జరిపిన బాలుడితో ఎలాంటి గొడవ జరుగలేదని ఆ విద్యార్థి చెప్పాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రైవేట్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కాల్పులు జరిపిన బాలుడు, అతడి తండ్రి కోసం పోలీసులు వెతుకుతున్నారు. విద్యార్థుల బ్యాగులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అన్ని స్కూల్స్‌ను ఆదేశించారు.
Boy Shoots Student
మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇది తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. పాఠశాలలో కాల్పుల సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.