కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 8: కూకట్పల్లి నల్లచెరువులో భూములు కోల్పోయిన బాధితులను ఆదుకోవడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబానినికి న్యాయం చేయాలని టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం కూకట్పల్లి నల్లచెరువు అభివృద్ధి విషయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలో నల్లచెరువును మాజీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో అభివృద్ధి చేయడం జరిగిందని, చెరువుకు మూడు వైపులా వాకింగ్‌ట్రాక్‌ను, పార్కును, ఓపెన్ జిమ్‌ను, గ్రీన్ బెల్ట్‌ను అభివృద్ధి చేశామన్నారు. 80 శాతం అభివృద్ధి చేసిన చెరువుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మెరుగులు దిద్ది తామే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ చేసిన ప్రతి పనిని తాము చేసినట్లుగా చెప్పుకుంటున్నారన్నారు.
సీఎం పర్యటనను అడ్డుకుంటాం..
చెరువు అభివృద్ధిపై నిజాలు చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు నిరసన సెగ తప్పదని హెచ్చరించారు. హైడ్రా కమిషనర్ మీడియాలో అంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లుగా చెబుతున్నారని దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు. కోరు ఆదేశాలను సైతం హైడ్రా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా చెరువు అభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోయిన వారికి కనీసం నోటీసులు ఇవ్వకుండా స్వాధీనం చేసుకున్నారని, చెరువు శిఖం, బఫర్ జోన్లో భూములను కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం కింద టీడీఆర్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితులకు అండగా ఉంటామన్నారు. పరిహారందక్కేవరకు పోరాడుతామన్నారు.