శామీర్‌పేట, జూలై 30 : చెడు వ్యసనాలకు బానిసైన బాల్య స్నేహితులు కరడుగట్టిన నేరస్తులుగా మారారు. దేవాలయాలను టార్గెట్ చేస్తూ.. దొంగతనాలు చేస్తున్నారు. శ్రీనివాసుడికే శఠగోపం పెట్టాలనుకున్న నిందితులు.. పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ కేసు వివరాలను మంగళవారం బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. శామీర్‌పేట పరిధిలోని అలియాబాద్ రత్నాలయంలో ఈనెల 23న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి శ్రీనివాసుడికే శఠగోపం పెట్టారు. ఏకంగా 10 తులాల బంగారం, 13.5 కిలోల వెండి ఆభరణాలతో పాటు 60 కిలోల పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు.
ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ ఏసీపీ రాములు నేతృత్వంలో శామీర్‌పేట సీఐ శ్రీనాథ్ ఆధ్వర్యంలో శామీర్‌పేట, సీసీఎస్, మేడ్చల్ జోన్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా బృందాలుగా ఏర్పడ్డారు. పాత నేరస్తుల జాబితాలను తిరగవేస్తూనే.. సీసీ టీవీలను పర్యవేక్షిస్తూ నేరస్తుల ఆట కట్టించారు. దాదాపు 400 సీసీ టీవీలను పరిశీలించి నిందితులను గుర్తించి పట్టుకున్నారు. నేరస్తులపై ఇప్పటికే శామీర్‌పేట, మేడ్చల్, పేట్ బషీరాబాద్, జీనోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్లలో నమోదైన 13 కేసుల్లో దాదాపు రూ.70 లక్షల సొత్తును నిందితులు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ సమావేశంలో ఏసీపీ రాములు, సీఐలు శ్రీనాథ్, నర్సింహారాజు, ఎస్ఐ మునింధర్, సిబ్బంది లాలు సింగ్, హరీశ్, పాలాక్ష, మహేశ్, రాజరత్నం, పెద్దయ్య పాల్గొన్నారు.
మేడ్చల్ మండలంలోని కండ్లకోయకు చెందిన నీలపు నీలయ్య అలియాస్ అనిల్, మేడ్చల్ పట్టణానికి చెందిన చింతాల శ్రీను చిన్ననాటి నుంచి స్నేహితులు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం వీరు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో చెత్త దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. డబ్బు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. శామీర్‌పేట, మేడ్చల్, పేట్ బషీరాబాద్, జీనోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 నేరాలు చేశారు. చివరిగా రత్నాలయంలో కూడా ఏకంగా ఆ శ్రీనివాసుడికే శఠగోపం పెట్టాలనుకొని దొంగతనం చేశారు. అయితే, వారి అంచనాలు తారుమారు అయ్యాయి.
రత్నాలయం చోరీని ఛాలెంజ్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. మేడ్చల్ మండలం, మునిరాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ అండర్ పాస్ వద్ద నగరానికి చెందిన మహమ్మద్ అస్లాం అలీకి ఆభరణాలు, విగ్రహాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు వారిని పట్టుకుని బంగారు, వెండి ఆభరణాలతో పాటు పంచలోహ విగ్రహాలు, నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ముషీరాబాద్‌కు చెందిన షరీఫ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.