హైదరాబాద్: బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్తమీద కోపం దుత్త మీద తీర్చినట్లుగా ముఖ్యమంత్రి వ్యవహారం ఉందని విమర్శించారు. మా మీద కోపం ఆడబిడ్డల మీద చూపిస్తున్నారని ఫైరయ్యారు. తెలంగాణ ఆడబిడ్డల అపురూప వేడుక బతుకమ్మ పండుగ అని చెప్పారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ సర్కార్ పుట్టింటి నుంచి చీర పంపినట్లు పంపేదని చెప్పారు. వారి సంతోషంలో భాగం అయ్యేదని వెల్లడించారు.
ఆడబిడ్డలకు ఇంకా గొప్పగా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి స్వాగతిస్తాం.. అంతే కానీ ఇచ్చేది కూడా ఆపేస్తే ఎలా అని ప్రశ్నించారు. లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకునే తెలంగాణ ప్రభుత్వం.. ఆడబిడ్డలకు ఇచ్చే చీరలు కూడా ఇవ్వలేదా అని నిలదీశారు. రెండు చీరలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఏమై పోయావ్ అంటూ ఎక్స్ వేదిగా దుయ్యబట్టారు.
అత్తమీద కోపం దుత్త మీద తీర్చినట్లు ఉంది మీ వ్యవహారం. మా మీద కోపం ఆడబిడ్డల మీద చూపిస్తున్నారు.
తెలంగాణ ఆడబిడ్డల అపురూప వేడుక బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు కేసీఆర్ సర్కార్ పుట్టింటి నుండి చీర పంపినట్లు పంపేది. వారి సంతోషంలో భాగం అయ్యేది
ఆడబిడ్డలకు ఇంకా గొప్పగా… pic.twitter.com/MVnxdeZClE
— KTR (@KTRBRS) September 26, 2024
రాష్ట్రంలోని ఆడబిడ్డల కోసం ప్రతి ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. పండుగ సమీపిస్తున్నా ఇప్పటి వరకు చీరల పంపిణీ ఊసే లేదు. కనీసం కానుకలు ఇచ్చే అంశం కూడా తెరపైకి రాలేదు. దీంతో ఆడబిడ్డలు మనోవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే బతుకమ్మ చీరల పంపిణీకి మంగళం పాడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్రంలో పండుగలా సాగేది. ఉచిత చీరలతో బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేవారు.
బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేత కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఏడాది చీరల తయారీ కోసం ఆర్డర్లు లేకపోవడంతో రాష్ట్రంలోని నేతన్నల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. నేత కార్మికులు మళ్లీ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. గత సీఎం కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో చేనేత కార్మికులు అన్ని విధాలా అభివృద్ధి చెందారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. 2017 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది దాదాపు కోటి మంది మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు. చీరల తయారీకి ఏడాదికి దాదాపు రూ.300 కోట్లకు పైగానే మొత్తం రూ.2,157 కోట్లు కేటాయించింది.
Bathukamma Sarees | బతుకమ్మ చీరలు బంద్.. ఆవేదన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డలు