Bathukamma Sarees | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఆడబిడ్డల కోసం ప్రతి ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. పండుగ సమీపిస్తున్నా ఇప్పటి వరకు చీరల పంపిణీ ఊసే లేదు. కనీసం కానుకలు ఇచ్చే అంశం కూడా తెరపైకి రాలేదు. దీంతో ఆడబిడ్డలు మనోవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే బతుకమ్మ చీరల పంపిణీకి మంగళం పాడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్రంలో పండుగలా సాగేది. ఉచిత చీరలతో బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేవారు.
ఆర్డర్లు లేక నేతన్నల ఇక్కట్లు..
బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేత కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఏడాది చీరల తయారీ కోసం ఆర్డర్లు లేకపోవడంతో రాష్ట్రంలోని నేతన్నల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. నేత కార్మికులు మళ్లీ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. గత సీఎం కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో చేనేత కార్మికులు అన్ని విధాలా అభివృద్ధి చెందారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. 2017 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది దాదాపు కోటి మంది మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు. చీరల తయారీకి ఏడాదికి దాదాపు రూ.300 కోట్లకు పైగానే మొత్తం రూ.2,157 కోట్లు కేటాయించింది.