e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home Top Slides ప్రైవేటు టీచర్లకు కొండంత అండ

ప్రైవేటు టీచర్లకు కొండంత అండ

ప్రైవేటు టీచర్లకు కొండంత అండ
  • కష్టకాలంలో కరుణచూపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ప్రతి నెలా రూ.2 వేలు, 25 కేజీల బియ్యం
  • 2,04,743కు పెరిగిన లబ్ధిదారుల సంఖ్య
  • మొదటి నెలతో పోలిస్తే 79 వేలు అదనం
  • సర్కారుపై నెలకు రూ.40.94 కోట్ల భారం

లావణ్య కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌. కొవిడ్‌తో పాఠశాల మూతపడి ఉపాధి కరువైంది. ఆమె భర్త కూడా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. కరోనాతో ఆయనదీ అదే పరిస్థితి. దాంతో ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇద్దరు కూతుళ్లు ఉండటం, ఖర్చులు వెళ్లకపోవడంతో ఆందోళన చెందారు. వారికి ఇప్పుడు సర్కారు అందిస్తున్న రూ.2వేల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యమే ఆధారమైంది. ‘మా ఇంట్లో ఇప్పుడు నిత్యం పొయ్యి వెలుగుతున్నది. నా ఇద్దరు బిడ్డలకు కడుపు నిండా తిండి పెడుతున్న. నాలాంటి ఎంతోమంది ప్రైవేటు ఉపాధ్యాయుల కుటుంబాలకు ఓ భరోసా వచ్చింది. దేశంలో ఎక్కడాలేని విధంగా కష్టకాలంలో సీఎం మాకు అండగా నిలబడ్డరు. సీఎం మానవీయ కోణంతో చేస్తున్న సహాయానికి మేమంతా రుణపడి ఉంటం’ అని లావణ్య చెప్తున్నారు.. ఒక్క లావణ్యనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకుపైగా ఉపాధ్యాయులదీ ఇదే మాట.

కరీంనగర్‌, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారి దెబ్బకు ఉద్యోగాలు పోయి దిక్కుతోచని స్థితిలో పడిన ప్రైవేటు సూల్‌ టీచర్లు ప్రభుత్వ సాయంతో ఇప్పుడు నిశ్చింతగా జీవిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రైవేటు టీచర్లకు నెలకు రూ.2 వేలు ఆర్థిక సహాయంతోపాటు 25 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించటంతో కరోనా కష్టకాలంలోనూ పంతుళ్లు గౌరవంతో బతుకుతున్నారు. రాష్ట్రంలోని 10,678 ప్రైవేటు పాఠశాలల్లోని 1,25,680 మందిని అర్హులుగా గుర్తించి, ఏప్రిల్‌ 20 నుంచి 25 తేదీల మధ్య ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఒక్కొక్కరికి 25 కిలోల సన్నబియ్యం పంపిణీ చేశారు. డైస్‌ రికార్డుల్లో లేనివారికి కూడా సాయం అందించాలని సీఎం ఆదేశించటంతో ఆ సంఖ్య 2,04,743కు చేరింది. మే 79 వేల మంది అదనంగా పెరిగారు. వారికి ఈ నెల 14 నుంచి 20 మధ్య ఏప్రిల్‌కు సంబంధించిన రూ.2 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. మళ్లీ అందరిని కలుపుకొని మే నెలకు సంబంధించిన రూ.2 వేలు తాజాగా అందించారు. అంటే ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున.. రెండు నెలలకు కలిపి 2,04,743 మంది ఉపాధ్యాయులకు రూ.81.89 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఒక్కొక్కరికి రెండు నెలల్లో 50కిలోల బియ్యం అందించారు. ప్రభుత్వం చేస్తున్న సాయం తమ కుటుంబాలను నిలబెట్టిందని ప్రైవేటు ఉపాధ్యాయలోకం ముక్తకంఠంతో చెప్తున్నది.

సీఎం దేశ చరిత్రలో నిలుస్తారు

దేశమే కాదు.. యావత్తు ప్రపంచ చరిత్రలోనే ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వపరంగా సాయం అందించిన, చేయూతనిచ్చిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం.. మా ప్రైవేటు టీచర్లు, సిబ్బంది కష్టాలు, కన్నీళ్లను అర్థం చేసుకున్నారు. కరోనా కాలంలో ‘నేనున్నాంటూ’ ఓ భరోసా ఇచ్చారు. చాలా మంది టీచర్లు అద్దెలు చెల్లించలేక సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అక్కడ ఉపాధి లేకపోవడంతో.. తిండికోసం కష్టపడాల్సిన పరిస్థితులున్నాయి. ఈ సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. మొదటి విడుత జాబితా విడుదలైన తర్వాత రెండో జాబితాలో మరో 79వేల మందికి అదనంగా చేర్చి, సాయం చేసిన గొప్ప మానవతావాది మన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చేయూత వల్ల ఎన్నో ఇండ్లల్లో పొయ్యిలు వెలుగుతున్నాయి. ఇంతటి సహాయాన్ని అందిస్తున్న సీఎం చరిత్రలో నిలువడమే కాదు, యావత్తు దేశానికి ఒక దిక్సూచిగా నిలిచారు.
-యాదగిరి శేఖర్‌రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు

రుణపడి ఉంటాం

దేశవ్యాప్తంగా మెజార్టీ ప్రైవేటు పాఠశాలలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అందులో పనిచేసే లక్షలాది మంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. కానీ, ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అండగా నిలిచారు. బోధనల ద్వారా ఎంతో మందికి విద్యనేర్పే మాకు.. నెలకు 25 కేజీల బియ్యం, 2వేలు అర్థిక సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం.
-ఎం సునీత, ప్రైవేటు టీచర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశానికి దిక్సూచి

విపత్కర పరిస్థితుల్లో ఉన్న రెండు లక్షల పైచిలుకు టీచర్ల జీవితాలకు సీఎం కేసీఆర్‌ భరోసా కల్పించారు. యావత్‌ దేశానికి దిక్సూచిలా నిలిచారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. రాష్ట్రం ఆర్థికంగా గడ్డు స్థితిలో ఉన్నా, టీచర్లను కాపాడుకోవాలన్న సీఎం సంకల్పం చాలా గొప్పది. వారు చేసిన సహాయాన్ని ప్రైవేటు టీచర్లు జీవితంలో మరిచిపోరు.
శ్రీనివాసరావు, ట్రస్మా కరీంనగర్‌ నగర అధ్యక్షుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రైవేటు టీచర్లకు కొండంత అండ

ట్రెండింగ్‌

Advertisement