DGP Jitender | హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక పోలీస్ విభాగంలో ఉత్తమ స్థాయిలో బాక్సింగ్, క్రికెట్ కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తున్నట్లు డీజీపీ జితేందర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్పీ బెటాలియన్లలో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ మొదటి బెటాలియన్‌లో డీజీపీ జితేందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ…. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్, క్రికెట్ క్రీడలలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని చాటి చెప్పిన బాక్సర్ నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ క్రికెటర్లు ప్రస్తుతం టీజీఎస్పీ డీఎస్పీలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని గుర్తు చేశారు. వారి ఆధ్వర్యంలో నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇచ్చేందుకు టీజీఎస్పీ విభాగంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. టీజీఎస్పీ సిబ్బందికి శాంతి భద్రతల పరిరక్షణలోనూ, ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేవలు చేసినందున వారికి ఎంతో పేరు ఉందన్నారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న టీజీఎస్పీ సిబ్బందిని మాదకద్రవ్యాలను అరికట్టేందుకు, సైబర్ నేరాలను నియంత్రించేందుకు కూడా వినియోగిస్తామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4077 మంది టీజీఎస్పీ కానిస్టేబుల్లకు శిక్షణ ఇచ్చామని, యూసుఫ్‌గూడ బెటాలియన్‌లో 548 మందికి శిక్షణ పూర్తయిందని తెలిపారు. భారీ స్థాయిలో టీజీఎస్పీ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి పోలీస్ విభాగంలో చేరుతున్న సిబ్బంది వారి తల్లిదండ్రులు గర్వపడేలా, రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా పని చేయాలని డీజీపీ కోరారు.
టీజీఎస్పీ అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న 4077 కానిస్టేబుల్‌లలో 2746 గ్రాడ్యుయేట్స్ , 596 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 62 మంది ఎక్స్ సర్వీస్మెన్లు ఉన్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Cold Wave | తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
KTR | రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్